Pawan Kalyan:పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం.. ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల అధినేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. తాను పోటీచేయబోయే పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 30 నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని.. అందుకు అనుగుణంగానే తన పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రణాళిక రూపొందించనున్నారు ఈ నెల 30న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనుండగా.. తొలి మూడు రోజులు ఆ నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని దర్శించుకుని వారాహి వాహనానికి పూజలు చేస్తారు. అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. అదే రోజు పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఉండనున్నాయి. తదుపరి శ్రీపాద వల్లభుని దర్శించుకోనున్నారు.
ఇక మార్చి 31న ఉప్పాడ సెంటర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 1న పార్టీలో చేరికలు, నియోజకవర్గంలోనే మేథావులతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగానే టీడీపీ, బీజేపీ నేతలతోనూ భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఇతర నియోజకవర్గాలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో సహా సర్వమత ప్రార్థనల్లో పవన్ పాల్గొంటారని తెలిపారు. అలాగే ఉగాది వేడుకలు సైతం పిఠాపురంలోనే జరుపుకోనున్నారని వెల్లడించారు.
మొత్తానికి ఈసారి ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉన్న పవన్.. అందుకు తగ్గట్లే కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే తన నియోజకవర్గంతో పాటు జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ పవన్ ప్రచారం నిర్వహించనున్నారు. వీటితో పాటు మూడు పార్టీలు నిర్వహించే బహిరంగసభల్లోనూ పాల్గొంటారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనతో పాటు తదితర కార్యక్రమాల్లోనూ హాజరుకానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments