పవన్ రూ.కోటి విరాళం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని ఏరియాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి. వరద ప్రవాహంలో చిక్కి సామాన్యులు చిగురుటాకుల్లా వణికి పోతున్నారు. నగరమంతా వర్షాలు గడిచిన వారం రోజులుగా నిత్యకృత్యంగా మారిపోయాయి. కాలనీలకు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు. ఎక్కడ చూసినా నీళ్లే. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జనమంతా ప్రాణాలు అరచేతపట్టుకుని ఉన్నారు. ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఆస్తి నష్టమూ అపారం... ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ తన వంతు సాయంగా కోటి రూపాయలు ప్రకటించారు.
‘‘ఒకవైపు కరోనా పట్టి పీడిస్తూ ఉంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడతెరిపిలేని వర్షాలు.. గత కొన్ని దశాబ్దాలు ఎప్పుడూ చూడనంత వర్షాన్ని దేశం మొత్తం చూసింది. ముఖ్యంగా తెలంగాణలో దీని తాకిడి వారం రోజులుగా చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది జీవితాలు ఛిద్రమైపోయాయి. ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లలోకి నీళ్లొచ్చేశాయి. గత కొన్ని దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలు పడుతున్న కష్టాలను వీటన్నింటినీ చూసి నా వంతు సాయంగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా సాయం ఉపయోగపడుతుందని భావిస్తున్నా. అలాగే జనసైనికులు, నేతలు సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనడానికి మీ వంతు కృషి చేయండి’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments