జగన్ జిల్లాలో పాగా వేయడానికి జనసైన్యానికి పవన్ దిశానిర్దేశం!
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సొంత జిల్లా అయిన కడపలో పాగా వేయడానికి అటు టీడీపీ.. ఇటు జనసేన రెండూ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వరుస సమీక్షలు, సమావేశాలతో పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా గురువారం నాడు.. ప్రతిపక్షనేత జగన్ ఇలాఖాలో జనసేన సత్తా ఏంటో చూపించడానికి తన సైన్యానికి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన కోసం ఒక పక్క విపరీతమైన పోరాటం జరుగుతుంటే.. ఆ పోరాటం తాలూకు ఒత్తిడిని తట్టుకునే నాయకుడు రాష్ట్రంలో ఒక్కరు కూడా లేకుండా పోయారని గతంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇందిరాగాంధీ లాంటి రాజకీయ సంకల్పం బలంగా ఉన్న నేతలు ఎలాంటి ఒత్తిడిని అయినా అవలీలగా తట్టుకునే వారని.. ఆవిడపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తన సిద్ధాంతానికి అనుగుణంగా రాష్ట్రాన్ని విభజించేందుకు అంగీకరించలేన్నారు. అటువంటి నేతలు మనకు ఇప్పుడు కనుమరుగైపోయారని పవన్ చెప్పుకొచ్చారు.
మార్పు కోసమే జనసేన..!
" 90వ దశకం చివరిలోనే తెలంగాణ బావజాలం బలపడడాన్ని నేను గమనించాను. ముఖ్యంగా యువతలో ఈ కోరిక బలపడడాన్ని గ్రహించాను. ఇది మార్పుకి సంకేతంగా నేను భావించాను.
తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాలు సాంస్కృతికంగా సమ్మిళితం కాలేకపోయాయి. ఇది కూడా వేర్పాటు బీజాల అంకురార్పణకి కారణం. రాయలసీమలో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది దీనిపై మనం ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయి. ఈ మార్పు కోసమే నేను 2014లో జనసేన పార్టీని ప్రారంభించాను. దీనికి తోడు తృతియ పక్షం లేని పక్షంలో ఉన్న రెండు రాజకీయ పక్షాలు తమ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉన్నందున మధ్యే మార్గంగా జనసేన ఆవిర్భావం జరిగింది. ప్రజారాజ్యం పెట్టక ముందు నేను కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాను. ఆ సమయంలో నాతోపాటు ఎవరైతే ఉన్నారో వారే జనసేన ఆవిర్భావ సమయంలో కూడా నాతోపాటు ఉన్నారు. 2003లోనే నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచే ప్రపంచ, దేశ, రాష్ట్ర సమకాలీన రాజకీయ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ వచ్చాను" అని పవన్ ఈ సందర్భంగా జనసైనికులకు వివరించారు.
వ్యక్తి కోసం.. వ్యవస్థ కోసమే..!
"నా రాజకీయ ఆలోచనలకి అనుగుణంగానే నా సినిమాలకి కూడా రూపకల్పన చేశాను. దృఢమైన భావజాలంతోనే జనసేనకు రూపకల్పన చేశాను. నేను వ్యవస్థని బలపర్చడానికి వచ్చానే తప్ప వ్యక్తిగా బలపడడానికి రాలేదు. పోరాటం చేసే వారికే గెలుపు సిద్ధిస్తుంది. గెలుపు కోసమే పని చేసే వారితో గెలుపు దోబూచులాడుతుంది. నాకు ముఖ్యమంత్రిగా పని చేయాలని ఉందంటూ ఓ పక్కన జగన్ అంటుంట.. మళ్లీ ముఖ్యమంత్రిని చేయమని చంద్రబాబు అంటున్నారు. అధికారం కోసం ఆలోచించే వారికి ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉండదు. ఇది మనకి చరిత్ర చెబుతున్న పాఠం. రాజకీయాలు నాకు వ్యాపారం కాదు. రాజకీయాల్లో నేను డబ్బు సంపాదించనక్కర్లేదు. స్టార్‌డమ్ ఉన్నత స్థితిలో ఉన్న సమయంలోనే నేను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేశాను. 2003 నుంచి డబ్బు ప్రభావిత రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఆ సమయంలోనే ఇటువంటి వ్యవస్థని మార్చడానికి ఒక నాయకుడు అవసరం అని భావిస్తున్న తరుణంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించారు. అయితే లక్ష్య ఛేదనలో ఆయన పక్కన ఉన్నవారే ఆయన్ని నిరాశకు గురిచేశారు. అటువంటి స్థితి తర్వాత నేను జనసేనను స్థాపించి కోట్లాది మంది జనం అభిమానం పొందుతున్నానంటే నేనెంత మొండివాణ్ణో" మీరు అర్ధం చేసుకోవచ్చని పవన్ చెప్పుకొచ్చారు.
జగన్‌లా నేను ఎప్పుడూ మాట్లాడలేదు..!
" 2014లో పరిమిత స్థానాల్లో పోటీ చేద్దామని తొలుత భావించాను. అయితే అలా పరిమిత స్తానాల్లో పోటీ చేయడం వల్ల పార్టీ బలపడదన్న ఆలోచనతో పోటీకి దూరంగా ఉండిపోయాను. ఫలితంగా జనసేన మద్దతు పలికిన తెలుగుదేశం, బీజేపీలు రాష్ట్రంలో విజయం సాధించాయి. టీడీపీలో వ్యక్తులెవర్నీ నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు. జనసేన ఐడియాలజీకి అనుగుణంగా ఒక ఫ్రేమ్ వర్క్‌లో మాత్రమే వారి గురించి మాట్లాడాను. ప్రతిపక్ష నాయకుడిలా చంపేయండి.. చింపేయండి వంటి మాటలను ఎప్పుడూ నేను ఉపయోగించలేదు. ఎప్పుడు విమర్శ చేసినా సంస్కారవంతంగానే జనసైనికులకి ఆదర్శవంతమైన భాషనే ఉపయోగించాను" అని జగన్ గతంలో మాట్లాడిన మాటలను ఈ సందర్బంగా పవన్ గుర్తు చేశారు.
ఈ ఎన్నికలే మనముందున్న పెద్ద సవాల్..!
" జనసైనికులంతా నాయకులుగా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఈ రాబోయే ఎన్నికలు మన ముందున్న ఒక పెద్ద సవాలు. జనసేనకు యువత, మహిళలు అండగా ఉన్నారు. వారి అండతో మనం ఈ ఎన్నికల్లో ముందుకి వెళ్లగలమన్న నమ్మకం ఉంది. జనసేన నిర్వహించిన కవాతులకి లక్షలాది మంది ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చారంటే అది వారిలోని ఆగ్రహాన్ని తెలియపరుస్తోంది.
జనసేనకు సంస్థాగత కమిటీల నియామకాన్ని ఇప్పటి వరకు ఎందుకు వేయలేదంటే మనందరిలోనూ ఒక ఏకీకృతమైన అభివృద్ది చెందవలసిన అవసరం ఉంది. ఆ తరహా అభివృద్ధి పోరాటాల ద్వారానే సిద్ధిస్తుంది. పండుగ తర్వాత కమిటీలు వేయడానికి సమాయత్తం అవుతున్నాను. కడప జిల్లాకి సంబంధించి రాజంపేట, కడప పార్లమెంట్ స్థాయి కమిటీలు ఉంటాయి. డబ్బులు రాజకీయాలని శాసించలేవని పలు సందర్భాల్లో రుజువైంది. జనసేనలో యువత రాజకీయ శక్తిగా మారడానికి కొంత సమయం పడుతుంది. వారిని రాజకీయ శక్తిగా మార్చే బాధ్యతను నేనే తీసుకుంటాను. ఐడియాలజీ, ప్రాక్టికాలిటీతో జనసేనను ముందుకి తీసుకెళ్తాను" అని ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments