తుపాను బాధితులకు అండగా పవన్ దీక్ష..
- IndiaGlitz, [Monday,December 07 2020]
తెలంగాణలో తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. బాధిత కుటుంబాలకు పరిహారంగా 35వేల రూపాయలు ఇవ్వాలని.. తక్షణ సాయంగా రూ. 10,000 ఇవ్వాలని పవన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు ఈ రోజు పవన్ దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉదయం పదిగంటలకు పవన్ దీక్షలో కూర్చున్నారు.
కాగా.. నేటి నుంచి వరద సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బాధితులు మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. అక్కడి నుంచి తరలి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నప్పటికీ బాధితులు వినడం లేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు మీ సేవా కేంద్రాల వద్ద నోటీసులు అంటించారు. నేరుగా జీహెచ్‌ఎంసీ అధికారులే ఇంటికి వచ్చి వెరిఫై చేసి సహాయం పంపిణీ చేస్తారని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని గవర్నమెంట్ మీ సేవా కేంద్రాలను ఈ ఒక్కరోజు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.
బాధితులు మీ సేవా సెంటర్ల వద్ద క్యూ కడుతున్న విషయమై జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా స్పందించారు. వరదసాయం కోసం బాధితులెవరూ మీ సేవా సెంటర్లకు రావద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు. అర్హులను గుర్తించి వరదసాయం అందిస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని, వరదసాయం అందని వారి వివరాలను అధికారులు సేకరిస్తారని చెప్పారు. బాధితుల అకౌంట్‌లోనే వరదసాయం డబ్బులు జమ చేస్తామని లోకేష్ కుమార్ స్పష్టం చేశారు.