ప్రజలు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటా!
Send us your feedback to audioarticles@vaarta.com
కర్నూలు జిల్లా విద్యార్థులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కాలేజీలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పలు సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ముఖాముఖి వేదికగా పవన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను మోసం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని.. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని మరోసారి స్పష్టం చేశారు.
జనసేన అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్య..
"ఉపాధి అవకాశాలున్నా.. ఉద్యోగవకాశాలు కల్పించడం లేదు. చట్టసభలకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలి. నేను చట్టసభల్లో లేకుండానే ఇన్ని సమస్యలను బయటకు తీసుకొచ్చాను. మార్పు కోసమే అధికారం. పనికిమాలిన మాటలు కంటే.. పనికొచ్చే మాటలు మాట్లాడటం నేర్చుకున్నాను. ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం పరిశోధన చేస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఒకప్పుడు నిజాయితీగల నేతలు ఉండేవారు. ఇప్పటి నేతలు ప్రజల సమస్యలపై పోరాడటం లేదు. చదువుకోవాల్సిన విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక పస్తులుంటున్నారు. విద్యార్థులను, యూనివర్శిటీలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ రావాలంటే నాణ్యమైన విద్యను అందించాలి. ప్రజలు ఓట్లు వేసినా.. వేయకపోయినా అందరికీ అండగా ఉంటాను. కాన్షీరాం స్పూర్తితో ముందుకెళ్తున్నాను. ఎల్కేజీ నుంచి ఇంటర్మిడీయట్ వరకు ఉచిత విద్య ఉండాలి. జనసేన అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్య అందిస్తాం. జనసేన ప్రభుత్వంలో మండలానికో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం" అని విద్యార్థులకు పవన్ ఈ సందర్భంగా భరోసా కల్పించారు.
నాకు అందరూ సమానమే...
"దేశం మీద ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఎవర్నీ నమ్మించడానికి ప్రయత్నం చేయను. నాకు ఇతరులకు సహాయం చేయడమే తెలుసు. జనసేనకు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, అందర్నీ సమానంగా చూస్తుంది, అందరికీ సమానంగా పంచుతుంది. మోసం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. కర్నూలును రాజధానిని మించిన నగరంగా నిర్మిస్తాం. జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా పర్సనల్ గేమ్‌ప్లాన్ చేసుకుంటే ఎలా?. వైసీపీ ఎమ్మెల్యేలు చట్టసభలకు వెళ్లకపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం నాకిష్టం. రౌడీయిజం, ముఠా కక్షలను చూస్తే విసుగొస్తుంది. మీ భయమే వాళ్లను పెంచుతుంది. వాళ్లు పెరుగుతున్నారంటే దానికి మీ పిరికితనం. వాళ్ల దగ్గర ప్రైవేట్ సైన్యం ఉంటే.. మీ దగ్గర గుండె నిండా ధైర్యముంది" అని పవన్ యువతకు సూచించారు.
మసీదులోకి అనుమతి నిరాకరణ..
విద్యార్థులతో సుమారు గంటన్నర పైగా ముఖాముఖి నిర్వహించిన అనంతరం జగన్నాథగుట్టకు పవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మసీద్‌ను సందర్శించమని ముస్లీం సోదరులు జనసేనానిని కోరారు. అయితే మసీద్ సందర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ప్రతిసారి దేశభక్తి నిరూపించుకోవాల్సిన అవసరం లేదున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout