రావి కొండలరావు గారి బహుముఖ సేవలు అజరామరం: పవన్
- IndiaGlitz, [Tuesday,July 28 2020]
ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రావి కొండలరావు మరణ వార్త విని తాను దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ఆయన తెలుగు చిత్రసీమకు అందించిన సేవలు అజరామరమన్నారు. ‘‘ప్రముఖ నటులు, రచయిత రావి కొండలరావు గారు తుది శ్వాస విడిచారని వార్త తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలుగు చిత్రసీమకు కొండలరావు గారు అందించిన బహుముఖ సేవలు అజరామరం. ఆయన మరణం సినీ రంగానికి ఒక లోటు. నాటక రచయితగా, నటుడిగా రంగస్థలానికి, పాత్రికేయుడిగా సినీ జర్నలిజానికి చేసిన సేవలు మరువలేనివి. సినీ రంగంలోని ఎన్నో మలుపులను అక్షరబద్ధం చేశారు.
ఆరు దశాబ్దాలకుపైబడి తెలుగు సినీ రంగంతో అనుబంధం కలిగి ఉన్నారు. విజయ సంస్థతోను, బాపు-రమణలతోను సన్నిహిత సంబంధాలు కలిగిన రావి కొండలరావు గారు నటుడిగా, సినీ కథా రచయితగా తన ముద్రను వేశారు. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ‘పెళ్లి పుస్తకం’ చిత్రానికి కథా రచయితగా అందరి ప్రశంసలతోపాటు పలు పురస్కారాలు అందుకున్నారు.
అన్నయ్య చిరంజీవి గారి చిత్రాలు మంత్రిగారి వియ్యంకుడు, చంటబ్బాయి లాంటి వాటిలో కొండలరావు గారు పోషించిన పాత్రలు అందరికీ గుర్తే. గత యేడాది ఒక పుస్తకావిష్కరణ సభలో వారిని కలిసినప్పుడు సినీ రంగ ప్రస్థానం, మలుపులు గురించి మాట్లాడుకున్నాం.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.