తుర్లపాటి మరణం నన్నెంతగానో బాధించింది: పవన్
- IndiaGlitz, [Monday,January 11 2021]
ప్రముఖ జర్నలిస్ట్.. పద్మశ్రీ పురస్కార గ్రహీత తుర్లపాటి కుటుంబరావు(89) కన్నుమూశారు. గత రాత్రి కుటుంబరావు గుండెపోటుకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఆయన చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1933 ఆగస్టు 10న తుర్లపాటి జన్మించారు. 14 ఏళ్ల వయస్సులోనే ఆయన జర్నలిజంలోకి అడుగు పెట్టారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. తుర్లపాటి మృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
తుర్లపాటి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటనను పవన్ విడుదల చేశారు. తుర్లపాటి మరణం తనను బాధించిందన్నారు. తెలుగు సినిమా విశిష్టతపై తుర్లపాటి చక్కటి కథనాలు, వ్యాసాలు అందించారని గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రముఖ పాత్రికేయులు, రచయిత, వక్తశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు మరణం బాధ కలిగించింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. తెలుగు పాత్రకేయ రంగంలో విలువలకు పట్టంగట్టారు కనుకనే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని పొందిన తొలి తెలుగు పాత్రికేయుడిగా నిలిచారు.
నవతరం జర్నలిస్టులకు శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు సినీ రంగానికి సెన్సార్ బోర్డు సభ్యులుగా గణనీయమైన సేవలందించారు. తెలుగు సినిమా విశిష్టతపై చక్కటి కథనాలు, వ్యాసాలు అందించారు. శ్రీ కుటుంబరావుగారి మృతికి వారి కుటుంబ సభ్యులకు నా తరుఫున, జన సైనికుల పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని పవన్ ప్రకటనలో పేర్కొన్నారు.