Pawan Kalyan:జగన్ ప్రభుత్వం అవినీతిపై ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు

  • IndiaGlitz, [Saturday,December 30 2023]

ఏపీలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(PawanKalyan) ప్రధాని మోదీ(PM Modi)కి ఫిర్యాదుచేశారు. ఈ కుంభకోణంపై సీబీఐతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని.. భూ సేకరణలో వైసీపీ ఎమ్మెల్యేలు భారీగా అక్రమాలు చేశారని ఆరోపిస్తూ ఐదు పేజీల లేఖ రాశారు.

పేదలకు ఇళ్ల నిర్మాణంలో భూసేకరణకు ప్రభుత్వం రూ.32,141కోట్ల నిధులను దుర్వినియోగం చేసిందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించి భారీ అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అలాగే గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించలేదని వివరించారు. మొత్తం 6.68 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి అయితే కేవలం 86,984 మందికి మాత్రమే అందించారని పవన్ వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని కోరారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కాకినాడ పర్యనటలో పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. వార్డుల వారీగా నాయకులతో సమీక్షలు జరుపుతున్నారు. ఈ నియోజకవర్గాన్ని పవన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వారాహి యాత్ర చేస్తున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడించి తీరుతానని శపథం చేశారు. దీంతో ఈ నియోజకవర్గంపై పవన్ స్పెషల్ ఫోసక్ పెట్టారు. అంతేకాకుండా ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసే అశకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.