రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ అమరావతిలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఈ వేడుకలను జనసేన ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే అంటే జెండా ఎగరేసి, జనగణమన పాడేసి, జై హింద్ చెప్పడం కాదని పవన్ చెప్పుకొచ్చారు. ఆదివారం ఉదయం జనసేన జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ గౌరవ వందనం సమర్పించారు. దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేశారని, ఆ త్యాగాల గురించి తెలుసుకుంటే మన దేశానికి, జెండాకు మనం ఇచ్చే గౌరవమే వేరుగా ఉంటుందన్నారు. రిపబ్లిక్ డే అంటే ఒక్క రోజు జరుపుకొనే పండగలా కాకుండా.. అనునిత్యం దేశ సమగ్రతను కాపాడుకునే బాధ్యతగా ఉండాలని అన్నారు.
అనుక్షణం మనం కాపాడుకోవాలి!
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘1950వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు మన దేశంలో బ్రిటీష్ చట్టాలన్నీ తొలగిపోయి.. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలవ్వడం మొదలైంది. వందలాది సంస్థానాలను తనలో విలీనం చేసుకొని భారతదేశం రిపబ్లిక్ దేశంగా అవతరించింది. మత ప్రాతిపదికన దేశ విభజన జరిగి పాకిస్థాన్ ఏర్పడినప్పుడు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం గొప్పతనం ఏంటంటే అన్ని మతాలు, మత విశ్వాసాలను సమానంగా గౌరవం ఇస్తుంది. కనుకే హిందు రిపబ్లిక్ గా దేశాన్ని ప్రకటించలేదు. ఆ అవసరం పాకిస్థాన్ కు ఉందేమోగానీ, భారతదేశానికి లేదు. మన గుండెల్లోనే సెక్యులరిజం ఉంటుంది. మానవత్వానికి స్పందించే దేశం మనది. ఈ దేశం కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేశారు. వాళ్ల శ్రమతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని అనుక్షణం మనం కాపాడుకోవాలి. దేశ సమగ్రతను కాపాడుకోవడానికి అందరూ బాధ్యతతో వ్యవహరించాలి, అవసరమైన త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలి’ అని పవన్ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments