తొలిసారిగా బీజేపీకి ఎదురెళుతున్న పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతో జనసేన కలిసి నడుస్తోంది. కార్యక్రమం ఏదైనా కలిసే పాల్గొంటున్నాయి. అయితే పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం జనసేన ఈ పొత్తు విషయమై మదనపడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఎన్నిక ఏదైనా సరే.. బీజేపీ అభ్యర్థిని మాత్రమే నిలబెడతారు వారికి జనసేన మద్దతు ఇవ్వాలి. దీంతో పైకి నవ్వుతున్నా.. జనసేన కార్యకర్తలు లోలోపల మాత్రం కుమిలిపోతున్నారు. ఈ క్రమంలోనే కనీసం తమకు తిరుపతి ఉప ఎన్నికలో అయినా ప్రాధాన్యత దక్కుతుందని జనసేన భావించింది. కానీ ఏమాత్రం ప్రాధాన్యం దక్కలేదు. ఢిల్లీ టు ఏపీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్ని సార్లు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.
అసలుకే ఎసరొస్తుందని..
ప్రస్తుతం తిరుపతి స్థానం నుంచి కూడా బీజేపీ అభ్యర్థియే రంగంలోకి దిగబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర అధిష్టానం తేల్చి చెప్పడంతో పవన్ మిన్నకుండిపోయినా.. జనసేన కార్యకర్తల్లో మాత్రం ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మరోవైపు ఏపీకి సంబంధించిన పలు అంశాల్లో కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. వీటిల్లో విశాఖ ఉక్కు అంశం ఒకటి. కానీ బీజేపీతో కలిసి నడుస్తుండటంతో పవన్ ఈ అంశంపై నోరు మెదపలేకపోయారు. దీంతో జనసేనపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఒక్క మాట కూడా స్పందించడం లేదంటూ ఏపీ ప్రజానీకంతో పాటు వివిధ పార్టీల నేతలు సైతం మండిపడుతున్నారు. పవన్ స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
వాణీదేవికి మద్దతు...
ఇక ఇలాగే ఉంటే చివరకు అసలుకే ఎసరొస్తుందనుకున్నారో ఏమో కానీ పవన్ బీజేపీతో పొత్తు తరువాత తొలిసారిగా ఆ పార్టీకి ఎదురెళ్లారు. బీజేపీ తలపడుతున్న పార్టీ అభ్యర్థికి తమ మద్దతును ప్రకటించింది. ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ తెలంగాణ బీజేపీపై బహిరంగ విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ బీజేపీ.. మా జనసేన పార్టీని అవమానించింది. బీజేపీ జాతీయ నాయకత్వం మాతో సక్యతగానే ఉంది. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మమల్ని పదే పదే అవమానిస్తున్నారు. అందుకే బీజేపీని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవికి మద్దతు ప్రకటిస్తున్నాం. మా క్యాడర్ సూచన మేరకు పీవీ కుమార్తె వాణిదేవికి మద్దతు ఇస్తున్నాం. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి’’ అని జనసేనాని చెప్పుకొచ్చారు.
వరుస అవమానాలు..
వాస్తవానికి తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికలోనూ జనసేనను కానీ ఆ పార్టీ కార్యకర్తలను కానీ బీజేపీ అస్సలు పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని తొలుత భావించింది. బీజేపీ నేతలతో సమావేశానంతరం అనూహ్యంగా ఆ ఆలోచనను విరమించుకుని బీజేపీకి మద్దతుగా నిలిచింది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారానికి రాగా.. జనసేన కార్యకర్తలు, పవన్ వీరాభిమానులు పెద్ద ఎత్తున విచ్చేయగా వారిని తీవ్రంగా అవమానించి పర్యటనలో పాల్గొనకుండా అడ్డుకుంది. ఇలా అడగడుగునా ఇలా వరుస అవమానాలతో విసిగిపోయిన జనసేనాని ఇవాళ తన అసంతృప్తినంతటినీ తమ పార్టీ ఆవిర్బావ వేడుక వేదికగా వెళ్లగక్కారు. మరి ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout