Pawan Kalyan: వ్యూహం మార్చిన పవన్ కల్యాణ్.. ఆ నియోజకవర్గం నుంచి పోటీకి కసరత్తు..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎత్తులు పైఎత్తులతో అధికార, విపక్షాలు దూసుపోతున్నాయి. ఎవరికి వారే గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనతో ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 ఎమ్మెల్యే సీట్లతో పోటీ చేసేందుకు రెడీ అయింది. ఇందులో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను మరో రెండు రోజుల్లో వెల్లడించనున్నారు. అయితే తొలి జాబితాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పలేదు.
తొలుత పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేయాలని పవన్ భావించినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు స్థానిక టీడీపీ, బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలోని పీఠాపురం నుంచి పోటీకి ఆయన మొగ్గు చూపినట్లు చర్చ జోరందుకుంది. దీంతో అలర్ట్ అయిన వైసీపీ పెద్దలు అక్కడి నుంచి కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి చేర్చుకుని పోటీ చేయించి పవన్‌కు చెక్ పెట్టాని డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి కూడా పవన్ పోటీ చేయడం లేదని వార్తలు ఊపందుకున్నాయి.
వైసీపీ వ్యూహాలకు చిక్కకుండా కావాలనే తాను పోటీ చేసే నియోజకవర్గం ప్రకటనను ఆలస్యం చేస్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఆయన పోటీ చేసే స్థానంపై క్లారిటీ వస్తుందంటున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా తిరుపతి పేరు తెరపైకి వచ్చింది. కొంతకాలంగా పవన్ గోదావరి జిల్లాల్లోని ఓ స్థానంతో పాటు తిరుపతిలోనూ పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. కానీ పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే దక్కడంతో ఆయన రెండు స్థానాల నుంచి పోటీ ఆలోచన విరమించుకున్నారు.
ఇప్పుడు తిరుపతి నుంచే పోటీ చేయడానికి జనసేనాని మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఎందుకంటే 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాగే ఇక్కడ పవన్ సామాజికవర్గమైన బలిజల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమనే అంచనాలకు వచ్చారట. ఈ మేరకు స్థానిక జనసేన, టీడీపీ, బలిజ నేతలతో మంతనాలు జరుపుతూ ఎప్పటికప్పుడు పార్టీ బలమెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట.
తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారంపై అధికారిక ప్రకటన లేకపోయినా బలమైన అభ్యర్థి కోసం మాత్రం జనసేన కసరత్తు చేస్తుంది. అయితే తాజా పరిణామాలు దృష్ట్యా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనే సంకేతాలు స్థానిక నేతలకు సమాచారం అందిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమ పరిశీలనలో ఉన్న బలిజ నేతలతో పాటు టీడీపీకి చెందిన బలిజ నేతలతో కూడా సమావేశమై మంతనాలు జరిపారట. అలాగే పవన్ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయని తిరుపతి టికెట్ రేసులో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు మరికొందరిని టీడీపీ హైకమాండ్ పిలిపించి ఆరా తీసిందట. గెలుపు అవకాశాలు ఎక్కువ అని వారు చెప్పడంతో తిరుపతిలో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
దీంతో అధికార వైసీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్‌కి ప్రత్యర్థికి పవన్ కల్యాణ్ పోటీ ఖాయమనే ప్రచారం జోరందుకుంది. పవన్ ఇమేజ్ ముందు రాజకీయ అనుభవం లేని అభినయ్ అభ్యర్థిత్వం తేలిపోనుందని జనసేన నేతలు భావిస్తున్నారు. దాంతో పవన్ గెలుపు నల్లేరు మీద నడకేనని అంచనాలు వేసుకుంటున్నారు. గతంలో సినీ ఇండస్ట్రీకి చెందిన దివంగత ఎన్టీఆర్, చిరంజీవి లాంటి ప్రముఖులను అసెంబ్లీకి పంపిన తిరుపతి.. ఇప్పుడు పవన్‌ను కూడా అసెంబ్లీకి పంపనుందనే ప్రచారం తిరుపతిలో ఊపందుకుంది. మరి తిరుపతి నుంచి జనసేనాని పోటీ చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout