Pawan Kalyan:ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన జనసేన.. పవన్ మాటల వెనక ఆంతర్యమేంటి..?
- IndiaGlitz, [Thursday,October 05 2023]
కృష్ణా జిల్లా పెడనలో జరిగిన వారాహి యాత్ర సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి మాత్రం పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్.. అప్పటి నుంచి ఎన్డీఏలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి మద్దతు కోసం ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. తనకు ఇష్టం లేకపోయినా ఇబ్బందుల్లో తెలుగుదేశం పార్టీ కోసం తప్పలేదన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం లాంటి బలమైన పార్టీ అనుభవం.. జనసేన పోరాట పటిమ అవసరమని స్పష్టం చేశారు. టీడీపీ అనుభవం, జనసేన యువరక్తం కలిసి జగన్‌ను అథ:పాతాళానికి తొక్కేయవచ్చని పవన్ వెల్లడించారు. సేనాని వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
టీడీపీతో బీజేపీని కలపాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన పవన్..
ఇన్నాళ్లు బీజేపీతో పొత్తులో ఉన్నా పవన్.. వైసీపీని ఓడించాలంటే 2014 ఎన్నికల్లో లాగా టీడీపీతో కలిసి పోటీ చేయాలని భావించారు. గత ఏడాది జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని తెలిపారు. ఇక అప్పటి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుకు పవన్ ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇందుకోసం టీడీపీతో పొత్తు కోసం కమలం పెద్దలను ఒప్పించేందుకు చాలా సార్లు ఢిల్లీ వెళ్లి కలిశారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో పొత్తుల అంశం లేట్ అవుతూ వస్తుంది. ఇదే సమయంలో స్కిల్ డెవలెప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం పవన్‌కు కలిసొచ్చింది.
టీడీపీతో పొత్తుపై జనసేన క్యాడర్‌లో కొంత అసంతృప్తి..
రాజమండ్రి జైలులో లోకేష్, బాలకృష్ణతో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అయి బయటకు వచ్చిన పవన్.. ఇదే సరైన సమయం అని భావించి టీడీపీతో కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో జనసేన-తెలుగుదేశం కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఇరు పార్టీల నేతలు దిశానిర్దేశం చేశారు. అయితే కొంతమంది జనసేన నేతల్లో మాత్రం అసంతృప్తి మొదలైంది. జనసేనకు గట్టి వాయిస్ వినిపించే కల్యాణ్ దిలీప్ సుంకర వంటి నేతలు ఈ ఆరు నెలలు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అలాగే మరికొంత మంది నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన జనసేన నేతలు వైసీపీని ఓడించాలంటే టీడీపీతో కలిసి పనిచేయాలని కోరారు.
బీజేపీ నుంచి దూరం అయ్యే వ్యూహంలో భాగంగానే పవన్ వ్యాఖ్యలు..
తాజాగా వారాహి యాత్రలో భాగంగా టీడీపీకి అండగా ఉండేందుకు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు పవన్ ప్రకటించారు. దీంతో జనసేన క్యాడర్ అయోమయంలో పడిపోయారని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని ఇంతలా ఎందుకు వెనకేసుకొస్తున్నారని కార్యకర్తల్లో అసంతృప్తి బయటకు వస్తుందని చెబుతున్నారు. పవన్ రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారా..? లేక తనతో బీజేపీ పెద్దలు కలిసి రావడం లేదని ఇలా బయటకు వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ చేరితే క్రిస్టియన్లు-ముస్లింల ఓట్లు ప్రభావితమవుతాయనే కారణం కూడా చెబుతున్నారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ పెద్దలు ఉన్నారనే అనుమానంతో పవన్ వ్యూహత్మకంగానే ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు.