Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే.. నాయకులకు పవన్ పిలుపు..
Send us your feedback to audioarticles@vaarta.com
వచ్చే ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చుపెట్టాల్సిందే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కనీసం భోజన ఖర్చులైనా పెట్టుకోరా అని ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేవి ఈ రోజుల్లో కుదరవన్నారు. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఖర్చును రూ.45 లక్షలకు పెంచిందని గుర్తు చేశారు. అయితే ఈ ఎన్నికలలో ఓట్లు కొంటారా? లేదా? అన్నది మీ ఇష్టమని స్పష్టంచేశారు. కనీసం 2029 తర్వాతైనా డబ్బులతో ఓట్లు కొనలేని రాజకీయం రావాలని.. అప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని వెల్లడించారు.
కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని... మనుషులను విడగొట్టడం ఆయనలో ఉన్న విష సంస్కృతి అని విమర్శించారు. కులాలు కొట్టుకు చావాలనేదే జగన్ నైజం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా కష్టపడి రూ.వేల కోట్లు సంపాదించి పెడితే.. జగన్ తన చెల్లెలికి అన్యాయం చేశారు. ఇద్దరు బిడ్డలకు వైఎస్ సమానంగా పంచి ఇస్తే.. అందులో చెల్లికి వాటా ఇవ్వలేదు. అది చాలా బాధ కలిగించే అంశం. వైఎస్ షర్మిలకు సాక్షి పేపర్, భారతి సిమెంట్‌లో వాటాలు ఇవ్వలేదు. సొంత చెల్లెలికే అన్యాయం చేసిన వ్యక్తి.. మనకేం చేస్తారు" అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికలకు జగన్ సిద్ధం అంటే.. తాము మాత్రం యుద్ధం అంటామన్నారు. మనం గెలవబోతున్నామని.. ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం ఎందుకు.. అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలి అని విమర్శించారు. ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు కొనసాగించాల్సిందేనని.. సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయన్నారు.
గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామన్నారు. మనకు ధైర్యం ఉంది.. పోరాటం చేస్తాం.. కానీ, ఓట్లు వేయించుకోవడం తెలియలేదన్నారు. అందుకే ఈసారి ఓట్లు చీలకూడదని పిలుపునిచ్చానని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి మంచి జరగాలనే పొత్తుల కోసం ప్రయత్నించానని.. టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే మనల్ని ఏ శక్తి ఆపలేదని పవన్ పేర్కొన్నారు.
కాగా ఉండి నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు అలియాస్ రత్నం దంపతులు.. కాకినాడకు చెందిన మత్స్యకార నాయకులు మల్లాడి రాజేంద్రప్రసాద్ పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments