సడన్‌గా పవన్ యూటర్న్ .. కథ మళ్లీ మొదటికొచ్చింది!
- IndiaGlitz, [Sunday,January 13 2019]
2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలకు మద్దతిచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అదే రూట్‌లోకి వెళ్లాలనుకుంటున్నారా..? అమెరికాకు వెళ్లిన పవన్ ఏం చేశారు.. ఎవర్ని కలిశారు? గత కొద్దిరోజులు పవన్ ఎందుకిలా మాట్లాడుతున్నారు..? సడన్ పవన్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు..? ఈ మాటలు దేని సంకేతాలు..? పొరపడి మాట్లాడారా.. లేకుంటే మనసులోని మాటే మాట్లాడారా..? అంటే పవన్ తాజా వ్యాఖ్యలను చూస్తే టీడీపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్లు, విమర్శకులు చెబుతున్నారు. అసలు పవన్ మాట్లాడిన మాటలేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చర్చనీయాంశమయ్యాయి అనేది ఇప్పుడు చూద్దాం.
సడన్ యూటర్న్ ఎందుకు..?
గుంటూరులోని తెనాలిలో సంక్రాంతి వేడుకలకు వెళ్లిన పవన్ కల్యాణ్‌కు పెదవూరు కార్యకర్తలు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఒక్కసారిగా టీడీపీ అనుకూలంగా.. మరోసారి పొత్తుకు నేనే రెడీ అన్నట్లుగా పవన్ మాట్లాడటం గమనార్హం. చంద్రబాబుపై కక్ష్య సాధింపు కోసమే టీఆర్ఎస్ జగన్‌కు మద్దతు ఇస్తోంది. జగన్‌ను తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనీయమని అడ్డుకున్నారు. వైఎస్ కూడా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉండే వాడు.
కానీ నేడు టీఆర్ఎస్-జగన్ కలసి నడుస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారాతాయో? వీళ్లని చూస్తే అర్థమవుతుంది అని పవన్ వ్యాఖ్యానించారు. అంటే.. ఇక్కడ పవన్ ఎవరికి సపోర్ట్ చేసినట్లు అనేది ఇట్టే అర్థం చేస్కోవచ్చు.
జగన్, కేసీఆర్ కలిస్తే ఎవరికి దెబ్బ..!?
పవన్ చెప్పినట్లుగానే జగన్‌కు సపోర్టుగా గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారానికి వస్తే ప్రయోజనం ఎవరికి..? తెలంగాణ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్తే ఎవరికి ఎవరు ఓట్లేశారనే విషయం అందరూ గమనించారు. బాబు పాచికలు అక్కడ పారకపోవడంతో మహాకూటమి కుప్పకూలిపోయింది. పక్కరాష్ట్రపోడికి మనమెందుకు ఓటేయ్యాలి..? ఆంధ్రోళ్లకు పెత్తనం ఎందుకివ్వాలి..? అని గుచ్చి గుచ్చి మాట్లాడిన కేసీఆర్ వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. దీంతో ఏపీ నుంచి శరవేగంగా వచ్చిన చంద్రబాబును ప్రజలు చక్కగా మళ్లీ కరకట్టకుపోయేలా చేశారు. అయితే రేపొద్దున కేసీఆర్ ఏపీకి వచ్చి ప్రచారం చేస్తే ఎవరికి ప్లస్ పాయింట్..? చంద్రబాబు, పవన్‌లకేగా ప్లస్. అలాంటప్పుడు అట్టర్‌ప్లాప్ అయ్యేదెవరంటే జగనే అని స్పష్టంగా అర్థమవుతోంది. జగన్‌కు మైనస్ పాయింట్ అయితే పవన్‌కు ముమ్మాటికీ ప్లస్సే కదా.. మరీ పైన చెప్పిన తమరి మాటలు దేనికి సంకేతమో ఆయనకే తెలియాలి మరి.
ఆయనలా.. ఈయనిలా!!
ఒకవైపు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అంటూ.. మరోవైపు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పవన్ తాజా మాటలను బట్టే అర్థం చేస్కోవచ్చు. మరీ ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘పవన్ మాతో కలిస్తే జగన్‌కేంటి ఇబ్బంది’ అని వ్యాఖ్యానించారు కూడా. అయితే పవన్ మాత్రం జనసేనది ఒంటరిపోరేనని చెబుతున్నారు. ఎక్కడో లాజిక్ మిస్సవుతోందని అనుమానం తప్పకుండా ప్రతి ఒక్కరికీ వస్తుంది. మొత్తానికి చూస్తే చంద్రబాబు-పవన్ నోట ఇంచుమించుగా ఒకే మాట రావడం... పవన్‌కు సీఎం సపోర్టుగా మాట్లాడటాన్ని బట్టి మరోసారి జోడీకి గ్రీన్ సిగ్నల్ పడేలా ఉందనే వార్తలు వస్తు్న్నాయి.
అమెరికాలో నిజంగానే..?
పవన్ కల్యాణ్ గతేడాది డిసెంబర్‌లో అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో పవన్ మీడియా కంటపడ్డారు ఇందుకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. అయితే మూడో కంటికి తెలియకుండా చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన ఒకరు టీడీపీ-జనసేన పొత్తులపై చర్చించారని టాక్ నడుస్తోంది. ఆ వ్యవహారం అక్కడ అమెరికాతోనే అయిపోయిందట. ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజులుగా టీడీపీపై తగిలితగలన్నట్లుగానే పవన్ మాట్లాడటం ఈ అనుమానానికి మరింత బలం చేకూరినట్లైంది. అయితే ఇది ఎంత వరకు నిజమనేది ఆ పెరుమాళ్లకు.. పవన్‌కే ఎరుక.
పవన్ వ్యాఖ్యలకు రియాక్షన్ ఉంటుందా..?
పవన్-కేసీఆర్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. కనీసం ఎలాంటి అనుమతి లేకుండా నేరుగా సీఎంను కలిచేంత సంబంధాలున్నాయ్. బహుశా ఈ బంధంతోనే రేపొద్దున పవన్ తరఫున కేసీఆర్ ప్రచారం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు భావించారు. అయితే ఇప్పుడు అదికాస్త రివర్స్ అయ్యి.. ఏకంగా కేసీఆర్, టీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా పవన్ మాట్లాడుతుండటం గమనార్హం. మొన్న వైసీపీ-జనసేనతో పొత్తుకు టీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారని చెప్పిన పవన్.. ఇప్పుడు ఏకంగా జగన్-కేసీఆర్ కలిసి చంద్రబాబుపై కక్ష్య సాధింపు దిగుతున్నారని వ్యాఖ్యానించారు పవన్. పూర్తిగా వైసీపీకి వ్యతిరేకమైపోయిన పవన్.. అదే రేంజ్‌లో చంద్రబాబును మాత్రం చూడటం లేదు. అంటే పవన్ మనసులో ఇంకా కొరతగానే ఉందని బాబుతో కలిస్తే అదికాస్త క్లియర్ అవుతుందని సెటైర్లు విసురుతున్నారు.
నాటి నంద్యాల ఎన్నికలు మొదలుకుని నేటి వరకూ జగన్ మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తానని చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ తాజా వ్యాఖ్యలపై జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? నిజంగానే పవన్-చంద్రబాబులు కలవబోతున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.