1500 కోట్లపై క్లారిటీ ఇవ్వు జగన్..: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. తనకు సీఎం పదవి ఇస్తే.. రూ. 1500 కోట్లు ఇస్తానని అప్పటి కాంగ్రెస్ అధిష్టానానికి బంపరాఫర్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. తాజాగా కడప జిల్లా పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఫరూక్ వ్యాఖ్యలపై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.
పవన్ మాటల్లోనే...
"ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నన్ను చంద్రబాబు పార్టనర్ అని, యాక్టర్ అని అంటున్నారు. ఆయనకు ఒకటే చెబుతున్నాను. నేను యాక్టర్‌ను కాదని ఏనాడు చెప్పలేదు. యాక్టింగ్ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నన్ను మీరు యాక్టర్ అని పిలిస్తే .. రెండేళ్లు జైల్లో ఉండి వచ్చిన మిమ్మల్ని నేను ఏమని పిలవాలి..?. నేను తెలుగుదేశం పార్టనర్ అయితే.. మీరు టీఆర్ఎస్, బీజేపీ పార్టనరా..? రాయలసీమలో పర్యటించకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారు.
సడెన్‌గా హెలికాఫ్టర్ పర్మిషన్లు క్యాన్సిల్ చేశారు. దీనికి జగన్మోహన్ రెడ్డి డైరక్షన్ ఇచ్చారా..? లేక భారతీయ జనతా పార్టీ డైరక్షన్ ఇచ్చిందా..?. ఇవాళ అనంతపురం సభకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో ఇబ్బందులు కలిగించారు. అలాంటి దుర్మార్గులతో నేనెందుకు చేతులు కలుపుతాను. టీడీపీతో కలిసిపోయానని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డికి కాస్తయినా ఇంగిత జ్ఞానం ఉండాలి. ముఖ్యమంత్రి పదవి కోసం రూ. 1500 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారని జాతీయ నేత ఫరూక్ అబ్దుల్లా అల్లా సాక్షిగా ఆరోపణలు చేస్తే ఎందుకు ఖండించలేదు. ఆరోపణలపై వివరణ ఇవ్వకపోతే నిజమని నమ్మాల్సి ఉంటుంది. ఇంతవరకు ఎవరెవరినో నమ్మి ఓటేశారు. ఒక్కసారి జనసేన పార్టీకి మద్దతు ఇవ్వండి. గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి జనసేన పార్టీ అభ్యర్ధులను అఖండ మెజార్టీతో గెలిపించండి. రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావాలని" కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout