జగన్ నిర్ణయం మంచి పరిణామం.. స్వాగతించిన పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే ఇదేంటి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారా అని కాసింత ఆశ్చర్యపోతున్నారు కదూ.. మీరు వింటున్నది నిజమే. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో వ్యతిరేకత వచ్చినా.. నచ్చకపోతే వ్యతిరేకిస్తారు అంతేకానీ మంచి పనులు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారంతే. అందుకే తాజాగా జగన్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని.. జనసేనాని అంగీకరించి.. మంచి పరిణామం అంటూ కితాబిచ్చారు. ఇంతకీ జగన్ తీసుకున్న ఆ కీలక నిర్ణయమేంటి..? పవన్ ఎందుకు స్వాగతించారు..? అనేది ఇప్పుడు కథనంలో తెలుసుకుందాం.
అసలేంటీ కథ!?
ఏపీ సీఎం జగన్ ఇప్పటికే పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలా వరకు జగన్ నిర్ణయాలను పవన్ వ్యతిరేకించినప్పటికీ.. అదే ఇంటి నుంచే ‘అన్నయ్య’ మెగాస్టార్ చిరంజీవి మాత్రం స్వాగతిస్తూ.. సీఎంకు మద్దతిస్తూ వచ్చారు. అయితే తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ‘తమ్ముడు’ పవన్.. ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. కర్నూలులో 2017లో సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలని.. లేకుంటే ఇదే ప్రాంతంలో ఒక రోజు నిరాహార దీక్షకు కూర్చుంటానని జల్లా పర్యటనలో పవన్ ప్రభుత్వాన్ని ఒకింత హెచ్చరించారు.
అంతేకాదు జిల్లా పర్యటనలో భాగంగా ఇందుకోసం ఈ నెల 12న భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీ కూడా చేపట్టారు. రాయలసీమ ఆడ బిడ్డను అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేస్తే జగన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు..? దిశ గురించి మాట్లాడిన మీరు సుగాలి ప్రీతి గురించి ఎందుకు మాట్లాడరు..? తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులను రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఎండగడుతున్నప్పుడు... వారి హయాంలో న్యాయం జరగని సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు..? అని ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు.
సీబీఐకి అప్పగించిన జగన్
సుగాలి ప్రీతి కేసును సీబీఐకి రిఫర్ చేయనున్నట్లు సర్కార్.. ఈ కీలక నిర్ణయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం నాడు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్.. ప్రీతి కుటుంబ సభ్యులకు అభయం ఇచ్చారు. పర్యటనలో ఉన్న జగన్‌ను కలుసుకుని, తమకు న్యాయం చేయాలని ప్రీతి కుటుంబం విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా.. ఆయన ఈ కేసును సీబీఐకి రిఫర్ చేస్తున్నామని.. తప్పక న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అంతేకాదు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కూడా అభయమిచ్చారు. ఈ విషయమై మరోసారి మాట్లాడదామని సీఎం కార్యాలయానికి రావాలని ప్రీతి కుటుంబానికి జగన్ చెప్పారు. అధికారులు ఆ కుటుంబాన్ని తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. అంటే త్వరలోనే ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లనుందన్న మాట.
స్వాగతించిన పవన్!
జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ స్వాగతించారు. ‘సుగాలీ ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. జగన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుగాలీ ప్రీతి కుటుంబానికి ఒకింత ఊరట కలిగిస్తుంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యమైంది. సీబీఐ విచారణ ద్వారా ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. పాఠశాలకు వెళ్ళిన చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఉసురు తీసినవాళ్లని కఠినంగా శిక్షించాలని కర్నూలు నగరం నడిబొడ్డున లక్షల మంది ప్రజలు నినదించారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేలా సుగాలీ ప్రీతి కుటుంబం వెన్నంటి ఉన్న జనసేన నాయకులకీ, జన సైనికులకీ, ప్రజా సంఘాలకీ నా అభినందనలు’ అని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఇలా!
అయితే.. జగన్ తమ ఒత్తిడితో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పుకుంటుండగా.. మరోవైపు ఎవరి దగ్గరికెళ్తే న్యాయం జరుగుతుందో వాళ్ల దగ్గరికి ప్రీతి కుటుంబం వెళ్లిందని.. అదే పవన్ గొప్పతనం కాదని జగన్ వీరాభిమానులు, వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఏదైతేనేం ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలనే ఆశిద్ధాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments