చెర్రీని అభినందించిన పవన్ కల్యాణ్
- IndiaGlitz, [Thursday,March 26 2020]
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విరాళం ప్రకటించారు. బాబాయ్‌ను స్పూర్తి తీసుకున్న అబ్బాయ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన వంతుగా విరాళం ప్రకటించారు. ఈ మేరకు 70 లక్షల రూపాయిలు విరాళంగా ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు.
అభినందనలు
సీఎంల సహాయనిధికి రామ్ చరణ్ విరాళాన్ని ప్రకటించడంపై జనసేనాని పవన్ కల్యాణ్ సంతోషాన్ని వెలిబుచ్చారు. ‘కరోనా మహమ్మారి కట్టడి కోసం రూ. 70 లక్షల విరాళాన్ని ప్రకటించిన చరణ్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
చెర్రీ ట్వీట్ ఇదీ...
‘పవన్ కల్యాణ్ గారి ట్వీట్‌తో స్ఫూర్తి పొంది కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిలీఫ్ ఫండ్‌కు మొత్తం కలిపి రూ.70 లక్షలు ప్రకటిస్తున్నా. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. అందరూ నిబంధనలకు లోబడే ఉండాలని ఒక బాధ్యతగల పౌరుడిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వాలు చేస్తోన్న కృషికి మద్దతుగా చిరు సాయం చేస్తున్నా. ప్రజలందరూ ఇంట్లోనే క్షేమంగా ఉండాలి’ అని ట్విట్టర్ వేదికగా అభిమానలు, తెలుగు రాష్ట్రాల ప్రజలను చెర్రీ కోరారు.