Pawan Kalyan :పార్టీలో అన్నయ్యకు కీ రోల్.. జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు, పవన్ సంచలన నిర్ణయం
- IndiaGlitz, [Saturday,April 15 2023]
జనసేన అంటే పవన్ .. పవన్ అంటే జనసేన.. ఇప్పటి వరకు ఇలా వున్న పరిస్ధితిని పవన్ కల్యాణ్ మార్చాలని నిర్ణయించుకున్నారు. జనసేన ఆవిర్భవించిన నాటి నుంచి పవన్ కల్యాణ్ తన ఛరిష్మాతోనే పార్టీని నడిపిస్తున్నారు. అయితే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వచ్చిన తర్వాత పార్టీ బాధ్యతలను పూర్తిగా ఆయనకే అప్పగించారు పవన్. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ ఆదేశాలతో ముందుకు సాగుతున్నారు నాదెండ్ల. పీఏసీ ఛైర్మన్ హోదాలో పార్టీలో నెంబర్ 2గా వున్న నాదెండ్ల పట్ల పార్టీలోని కొన్ని వర్గాలు గుర్రుగా వున్నాయి. దీనిపై పలుమార్లు అధినేత దృష్టికి కూడా తీసుకెళ్లారు.
నాగబాబుకు రాజకీయంగా అనుభవం :
అయితే సార్వత్రిక ఎన్నికలు, ఏపీ, తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పవన్ యాక్టీవ్ అయ్యారు. అత్యంత కీలకమైన సమయం కావడంతో బాధ్యతలను ఆయన విభజిస్తున్నారు. ఈ క్రమంలోనే తన సోదరుడు , మెగా బ్రదర్ నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబును నియమించారు పవన్. ప్రస్తుతం పీఏసీ సభ్యునిగా సేవలందిస్తున్నారు నాగబాబు. కొత్త బాధ్యతలతో పాటు ఎన్ఆర్ఐ విభాగం, అభిమానులను సమన్వయ పరిచే పనిని కూడా నాగబాబుకు అప్పగించారు పవన్. దూకుడైన వ్యక్తిత్వంతో పాటు రాజకీయాలపై అవగాహన, విషయ పరిజ్ఙానం, గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన అనుభవం , అభిమానులు, కాపు సామాజిక వర్గంలో నాగబాబుకు వున్న పరిచయాలను బేరీజు వేసుకుని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వేములపాటి అజయ్ కుమార్‌కి కూడా కీలక బాధ్యతలు :
ఇక.. నాగబాబుతో పాటు పార్టీ పెట్టిన నాటి నుంచి తన వెంట నడుస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన వేములపాటి అజయ్ కుమార్‌కి కీలక బాధ్యతలు అప్పగించారు పవన్ కల్యాణ్. పార్టీ అధికార ప్రతినిధిగా జాతీయ మీడియాను సమన్వయం చేసుకోవడం, రాజకీయ శిక్షణ తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ నిర్వహణ బాధ్యతలను అజయ్‌కి అప్పగించారు పవన్. వీరిద్దరూ పార్టీకి సమర్ధవంతంగా సేవలందిస్తారని పవన్ ఓ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు.