నవంబర్ 10న అనంతపురంలో పవన్ బహిరంగ సభ
- IndiaGlitz, [Monday,October 24 2016]
నవంబర్ 10న అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించాలని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ సాధన కోసం ప్రతి జిల్లాలో పోరాట సభను జనసేన నిర్వహిస్తుందని తిరుపతి బహిరంగ సభలో జనసేన సేనాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాయలసీమలో వెనకబడిన ప్రాంతమైన అనంతపురంలో సభ జరపాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ హోదా వచ్చినట్లయితే ఏటా కరువుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని శ్రీ పవన్ అభిప్రాయపడ్డారు. స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే నిధులతో ఈ జిల్లాను కరువు నుంచి కాపాడుకోవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందువల్లే ఈసారి బహిరంగ సభను అనంతపురం జిల్లాలో నిర్వహించాలని నిశ్చయించినట్లు చెప్పారు.
అసలు ఈ సభ అక్టోబరు మొదటివారంలో జరపాలని తొలుత నిర్ణయించామని, అయితే దేశ సరిహద్దు భారత సైన్యం సర్జికల్ దాడులలో నిమగ్నమై ఉన్నందున ఇది తరుణం కాదని ఈ సభను నవంబరుకు వాయిదా వేశామని పవన్ వెల్లడించారు.
ప్రత్యేక హోదాతో పాటు సామాజిక సమస్యలపై కూడా పోరాటం కొనసాగుతుందని జనసేనాని స్పష్టం చేసారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో గ్రామస్థుల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గోదావరి ఆక్వా పార్కు పై జనసేన గళం విప్పిన సంగతిని గుర్తు చేసారు. అనంతపురంలో జరపనున్న సభ సమయం ప్రదేశాన్ని మరోసారి తెలియచేయగలం. సభకు అవసరమైన అనుమతుల సాధన, ఏర్పాట్లలో జనసేన నేతలు నిమగ్నమై ఉన్నారు అని జనసేన పార్టీ కోశాధికారి ఎం.రాఘవయ్య తెలియచేసారు.