కడప గడ్డపై జగన్ గురించి పవన్ ఏమన్నారంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతోగానీ, వైసీపీతోగానీ జతకట్టదని, వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు 25 కేజీల బియ్యం, మూడు వేల రూపాయలు పాకెట్ మనీ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారని.. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 10 లక్షలు చొప్పున 5 ఏళ్లు 50 లక్షల బీమా చేయిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం కడప నగరంలోని అన్నమయ్య సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తూ.. వేలకోట్లు దోచేసి పిల్లికి బిచ్చం వేసినట్లు రూ. 2 వేలు, రూ. 3వేలు ఇస్తున్నారు. అమలు సాధ్యం కాని హామీలతో మీ జీవితాల్లో రత్నాలు కురిపిస్తామని అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. జనసేన పార్టీ దగ్గర రత్నాలు లేవు కానీ అందరికి సమానంగా పంచే మనసుంది. తెలుగుదేశం పార్టీతో జనసేన జతకట్టిందని ప్రతిపక్ష పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రంలో ఉతికి ఆరేసింది జనసేన పార్టీ గానీ, వైసీపీ పార్టీ కాదన్నారు.
నా హెచ్చరిక...
"కష్టం వస్తే పారిపోయే వ్యక్తిని కాదు. అందరికీ అండగా ఉంటా. నా మీద భరోసా ఉంచండి. ఓ వైపు జనసేనకు బలం లేదంటూనే మన బలం చూసి భయపడుతున్నారు. జనసైనికుల మీద దాడులకి పాల్పడుతున్నారు. జనసేన కార్యకర్తల మీద దాడులు చేసే వారికి ఇదే నా హెచ్చరిక. నా పేరు పవన్కళ్యాణ్... మా జనసైనికుల మీద ఎవరైనా దాడులు చేస్తే తోలుతీస్తా. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున అన్ని అంశాలకీ సమాధానం చెబుతాను" అని పవన్ స్పష్టం చేశారు.
జగన్కు దమ్ము లేదు..
"ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఆ దమ్ము లేదు. చట్ట సభల నుంచి పారిపోయారు. పదవిలో లేకపోయినా, పార్టీలో ఒక్క కౌన్సిలర్ లేకపోయినా అవినీతిపై బలంగా గళమెత్తింది జనసేన పార్టీయే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ పార్టీకి ఆ దమ్ము, ధైర్యం లేవు. మా పార్టీ నుంచి ఎవరూ చట్టసభలకు వెళ్లకపోయినా అనంతపురంలో మహిళల అక్రమ రవాణాను అడ్డుకున్నాం. భయపెట్టి పాలించేవాడు నాయకుడు కాదు" అని పవన్ చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛనిచ్చే వాడు నాయకుడు..
మంచి ఆశయాలతో చిరంజీవి గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అయితే పార్టీలో ఉన్న నాయకుల ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. దీంతో పార్టీని ముందుకు తీసుకెళ్లలేక కాంగ్రెస్ లో వీలినం చేశారు. జనసేన పార్టీ మాత్రం సైద్ధాంతిక బలంతో వచ్చిన పార్టీ. ఫ్యాక్షనిజం, రౌడీయిజం తట్టుకోగలనా..? లేదా..? వేలకోట్లతో ముడిపడి ఉన్న రాజకీయాలను ఎంతవరకు ఎదుర్కొనగలం..? ప్రజలకు ఉపయోగపడని ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత ..? అని ఆలోచించి పార్టీ పెట్టాను. అప్పట్లో దెబ్బకొట్టారు. తట్టుకొని నిలబడ్డాం. మీ చచ్చు ఆటలు ఇక సాగవు. మీ అవినీతి కోటలు బద్దలు కొట్టి తీరుతాం. మీ ఫ్యూడల్ కోటలు బద్దలు కొడతాం. మీరు భయపెట్టి పాలిద్దాం అంటే ఇది 2009 కాదు 2019 గుర్తించుకోండి . దెబ్బతిన్న బెబ్బులిలా ఉన్నాం కొమ్ములు పీకిపారెస్తాం. ఓటమికి భయపడేవాడిని కాదు మార్పు కోరుకున్నవాడిని. ధైర్యం లేని వాళ్లు జనసేన పార్టీలోకి రాకండి" అని పవన్ తెలిపారు.
రెడ్లంతా ఆనందపడ్డారు..
"రెడ్డి అంటే రక్షించేవాడే కానీ దోపిడి చేసేవాడు కాదని కర్నూలు సభలో మాట్లాడాను. మరుసటిరోజే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు నా దగ్గకు వచ్చి ఆనందపడ్డారు. నేను ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు. అందుకే నా పేరు వెనుక రెడ్డి, నాయుడు, చౌదరి అని ఉండవు. కులం లేని వాడిని. నా నలుగురి పిల్లల్లో ఇద్దరిది హిందుమతం అయితే ఇద్దరిది క్రిస్టియన్ మతం. నా సన్నిహితులు ఎక్కువగా ఇస్లాం మతం పాటిస్తారు. కులాలను కలిపే రాజకీయం చేయడానికి వచ్చాను తప్ప, కులాలను విడదీసే రాజకీయాలను చేయను. ఏ కులం కూడా ఇంకో కులాన్ని తొక్కేద్దాం అనుకోదు. కులంలో కొంతమంది మాత్రం వారి స్వలాభానికి కులాలను వాడుకుంటారు. జనసేన దానికి వ్యతిరేకం. కుల ప్రస్థావన లేని రాజకీయమే జనసేన లక్ష్యం" అని పవన్ అన్నారు.
రౌడీలకీ, కిరాయి మూకలకీ భయపడేది లేదు
"రాయలసీమ పర్యటనకు వస్తున్నానంటే చాలామంది నాయకులు ఎలా వస్తారో మేము చూస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. ఆత్మగౌరవం, పౌరుషం ఉన్నవాడిని కిరాయిమూకలకు, ప్రైవేటు సైన్యానికి భయపడేవాడిని కాదు. రౌడీయిజంతో రాజకీయం చేసే మీకే అంత దమ్ముంటే.. దేశ కోసం చచ్చిపోవాలనుకున్నవాడిని నాకెంత ఉండాలి. మీ బాంబులు, రౌడీలు, కిరాయి సైన్యానికి భయపడతానా...? అంత చేవ చచ్చి కూర్చున్నామా..? దమ్ము లేదా మాకు..? మా ఆడపడుచులు వీరతిలకం దిద్దితే వచ్చిన వాళ్లం మాకేంటి భయం. బద్దలు కొడతాం. కడప నడిబొడ్డు నుంచి చెబుతున్నాం మీ అవినీతి కోటలు బద్దలు కొట్టి తీరుతాం. యువత, ఆడపడుచులు రోడ్ల మీదకు వచ్చి జనసేన జనసేన అని అరుస్తున్నారంటే భయపెట్టే, దోపిడిచేసే, అవినీతి రాజకీయాల నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్ధం. ఇది అధికార, ప్రతిపక్షాలకు అర్ధం కావడం లేదు. రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం కాదు. వెనక్కి నెట్టబడిన ప్రాంతం. ఇవాళ కడపకు వచ్చింది ఓట్లు వేయమని అడగటానికి కాదు. గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను" అని జనసేనాని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout