నేను ముఖ్యమంత్రి అయితే.... పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌కు తాను ముఖ్యమంత్రి అయితే లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ హామీ ఇచ్చారు. సీమ నుంచి వచ్చిన ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ది చేస్తానన్నారు. పదేళ్లు సమయం ఇస్తే సీమలో నిరుద్యోగం అన్న మాట వినబడకుండా చేస్తానన్నారు. గురువారం కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... "రాయలసీమకి కొందరి వల్ల లక్ష కోట్ల దోపిడి అన్న పేరు వచ్చింది. రాయలసీమ కూడు తిన్నవాడిని, రాయలసీమ వారి నుంచి జీవితం పొందినవాడిని ఆ ఏడుకొండలవాడి సాక్షిగా చెబుతున్నా.. మీకు అండగా ఉంటాను. రాయలసీమ నుంచి వలసలు ఆగిపోయేలా చేస్తా. గల్ఫ్ ప్రాంతాలకి వలసలు ఆగేలా చేసి ఇక్కడే ఉపాధి కల్పనకు అవకాశాలు ఇస్తాం. రాయలసీమని చదువుల సీమగా మారుస్తా. నా దగ్గర రత్నాలు, వజ్రాలు, మాణిక్యాలు లేవు. చంద్రబాబు గారి దగ్గర ఉన్న భరోసా లేదు. మీ కోసం అవసరం అయితే కూలి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రతిపక్ష నేతలా నవరత్నాలు మీ ఇంట పండిస్తానని చెప్పను... ఈ ప్రాంతంలోని ఆల్విన్ ఫ్యాక్టరీ భూములని అడ్డగోలుగా ప్రయివేటు కనస్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చేస్తే, అలాంటి ప్రజల ఆస్తిని తిరిగి తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా"అని పవన్ భరోసా ఇచ్చారు.
రైతాంగానికి అండగా నిలుస్తాం
"రాయలసీమ నుంచి ఇంత మంది ముఖ్యమంత్రులు అయ్యారు. నాయకులు అయ్యారు. చాలామంది బయట జిల్లాల మీద పడి దోపిడిలు చేస్తారన్న చెడ్డపేరు తెచ్చారు. కానీ ఇది చదువుల నేల, ఈ నేల సాక్షిగా చెబుతున్నా... అందరికీ విద్య, వైద్యం ఉచితంగా అందించే ఏర్పాటు జనసేన ప్రభుత్వం చేస్తుంది. మీ స్వశక్తి మీద మీరు ఆధారపడే జీవితాన్ని ఇస్తుంది. జనసేన పార్టీ ప్రభుత్వం వస్తే ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల మెడికల్ ఇన్సురెన్స్ చేయిస్తాం. ప్రతి విద్యార్ధికి ఫీజు రీఎంబర్స్మెంట్ కాదు. అసలు ఫీజు కట్టనవసరం లేని పరిస్థితులు తీసుకువస్తాం. ప్రతి విద్యార్ధికి ఉచిత బస్ పాస్‌లు ఇస్తాం. బస్సులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తాం. కాలేజీల దగ్గర ఉచిత క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. స్టూడెంట్ పాస్ చూపితే ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేస్తాం. విద్యార్ధులకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా వారి పాకెట్ మనీ వారే సంపాదించుకునే ఏర్పాటు చేస్తాం. జనసేన ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీలో పది వేల ఉద్యోగాలు పర్యాటక రంగంలోనే ఇస్తాం" అని పవన్ భరోసా ఇచ్చారు.
సీఎం మళ్ళీ మోసం చేస్తున్నారు
"ముఖ్యమంత్రి గారు మహిళల అకౌంట్లకి డబ్బులు వేస్తామంటూ పథకాలు పెట్టారు. ఒక సీజన్‌కి ఇచ్చారు. ఆడపడుచుల మీద నిజంగా ప్రేమే ఉంటే ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇవ్వొచ్చుగా, ఎన్నికల ముందు ఎందుకు ఇస్తున్నారు. అంటే మళ్లీ మోసం చేస్తున్నారు. నేను మీకందరికీ హామీ ఇస్తున్నా జనసేన ప్రభుత్వంలో కుటుంబ కార్డు ఆధారంగా నెలకి రూ 2500 నుంచి రూ.3500 మీ అకౌంట్లలో జమ అయ్యే ఏర్పాటు చేస్తా. ఉచిత గ్యాస్ అందిస్తాం. ఆడపడుచులకి ఆకతాయిల నుంచి మాన, ప్రాణాలకి భద్రత కల్పించేందుకు పటిష్టమైన చట్టాలు తీసుకువస్తా" అని పవన్ హామీ ఇచ్చారు.
బొత్సాను తరిమికొట్టారు..
"వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఈ మధ్య జనసేన పార్టీ టీడీపీతో కుమ్మక్కయ్యిందని చెబుతున్నారంట. విజయనగరంలో ఆడపడుచులు తరిమికొట్టారు. మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే పిచ్చి పిచ్చి మాటలు ఆపండి. మా కేడర్ని గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తే.. విజయనగరం వచ్చి మీ సంగతి తేలుస్తా. మరోసారి చెబుతున్నా.. జనసేన పార్టీ వామపక్షాలతో మినహా టీడీపీతో గానీ, వైసీపీతో గానీ పొత్తు పెట్టుకోవడం లేదు. మీరు నా మీద పెట్టిన భరోసా నిరూపించుకుంటా. ఒంటరిగానే బరిలోకి దిగుతాం. మీరు ఇచ్చే బలాన్ని బట్టి చట్ట సభల్లో పోరాటం చేస్తాం. చట్టసభలకి వెళ్లకుండానే పోరాటం చేస్తున్నాం. ఆదోనిలో గవర్నమెంట్ కాలేజీ గురించి మాట్లాడితే వెంటనే శాంక్షన్ అయ్యింది. అది మన బలం. 2019లో నేను సిఎం కాకుండా ఎవ్వరు ఆపుతారో చూద్దాం. మనం పల్లకీలు మోసింది చాలు. ఇక మీదట ఎవరి పల్లకీలు మోయాల్సిన అవసరం లేదు. జనసేన ప్రభుత్వంలో సత్యాన్ని, ధర్మాన్ని పల్లకీలు ఎక్కించి మోయిద్దాం" అని పవన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే జనసేన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, బొత్స సత్యనారాయణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments