రైతుల కన్నీరు క్షేమదాయకం కాదు - పవన్
- IndiaGlitz, [Sunday,January 22 2017]
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక అమరావతి ప్రాంతంలోని కృష్ణ నది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ కు క్షేమదాయకం కాదు. పోలవరం ప్రాజెక్ట్ పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్ గా మార్చడం ఎంత వరకు న్యాయమో ప్రజా ప్రతినిధులు చెప్పాలి అంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తెలుగుదేశం ఎం.పి రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం గుత్తేదారు కంపెనీ ట్రాన్ స్ట్రాయ్ అడ్డుగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డ్ గా మార్చేస్తే ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తారో అన్న వివేకం కూడా చూపకపోతే ప్రజా ప్రతినిధులను ఏమనుకోవాలి. పోలవరం నిర్మాణ ప్రగతి పై నెలకోమారు సమీక్ష జరుపుతున్న సర్కార్ ఈ సమస్య పై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్ధం కావడం లేదు. ఈ భూముల రైతులు తమ వారు కాదన్నా...లేదా కాంట్రక్టర్ కు ఇబ్బందైనా గత్యంతరం లేని రైతులు తగిన నష్టపరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినరు. పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారు.
ఇది అన్యాయం అని అడిగితే పోలీసులతో కేసులు పెట్టించి వారి నోరు మూయిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇకనైనా వారికి న్యాయం చేయండి. అమరావతిలోని కృష్ణ నది లంక భూముల రైతుల బాధను సమాజ వికాసాన్ని కాంక్షించే వారు అర్ధం చేసుకోవాల్సి ఉంది. తాము దళితులం అయినందు వల్లే తాము నష్టపరిహారం చెల్లింపులో వివక్షకు గురవుతున్నామని ఈ ప్రాంత రైతులు ఆవేదనతో ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. అసలు గ్రీన్ ట్రిబ్యూనల్ నిబంధనల ప్రకారం నది పరిహారంలో ఉన్న భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకున్నదో లేదో స్పష్టత లేదు. ఈ భూములను తీసుకుని ఏమీ చేస్తారో ముందుగా ప్రజలకు లేదా కనీసం రైతులకు అయినా తెలియాలి. భూముల సేకరణ ముందు ఎంత మేరకు నష్ట పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో అంత ఇవ్వాలి. పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా వివక్షత పాటించడం మంచిది కాదు. ఒకవేళ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని జనసేన డిమాండ్ చేస్తోంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.