పద్మ పురస్కారాలతో ప్రతిభాశీలురకు పట్టం: పవన్
- IndiaGlitz, [Wednesday,January 27 2021]
గాన గంధర్వుడు దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బాలును పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడంతో పాటు తెలుగు రాష్ట్రాలకు నాలుగు పద్మ పురస్కారాలు లభించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ పవన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘చలనచిత్ర సంగీత రంగంపై శ్రీ బాలు గారి ముద్ర చెరగనిది. మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపిక చేయటంఆయన కీర్తిని మరింత పెంచింది. ప్రఖ్యాత గాయని శ్రీమతి కె.ఎస్. చిత్ర గారిని ‘పద్మభూషణ్’ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరం. నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది భాషలతోపాటు పలు భాషల్లో తన గళంతో శ్రోతలను మైమరపించారు.
ప్రముఖ వయొలిన్ విద్వాంసులు శ్రీ అన్నవరపు రామస్వామి గారు శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవలకు ‘పద్మశ్రీ’ గౌరవం దక్కింది. మృదంగ విద్వాంసులంటే పురుషులే అనుకొన్న సమయంలో తొలి మహిళ మృదంగ విద్వాంసురాలిగా కచేరీలు చేసిన శ్రీమతి సుమతి గారి ప్రతిభకు సరైన గుర్తింపు ‘పద్మశ్రీ’ పురస్కారంతో దక్కింది. మన మాతృభాష తెలుగుకు విశేషమైన సేవలు అందించి, అవధాన విద్యలో దిట్టగా నిలిచిన శ్రీ ఆశావాది ప్రకాశరావు గారిని ‘పద్మశ్రీ’ వరించడం మన తెలుగు అవధానానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
ఆదివాసీల సంస్కృతిసంప్రదాయాలను కాపాడుతున్న గుస్సాడీ నృత్యప్రవీణుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీ కనకరాజు గారిని పద్మశ్రీకి ఎంపిక చేయడం కళలకు మరింత జీవంపోసింది. ప్రతిభావంతులకు పట్టంగట్టే విధంగా పద్మ పురస్కారాల ఎంపిక సాగింది. వీరందరికీ నా తరఫున, జనసేన పక్షాన శుభాభినందనలు తెలియచేస్తున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.