ఎస్పీవై రెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
నంద్యాల జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డి అలియాస్ పైపులరెడ్డి అనారోగ్యంతోకొద్ది రోజుల క్రితం అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శనివారం నాడు నంద్యాలకు వెళ్లి ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణలో ఉన్న ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దురదృష్టవశాత్తు ఎస్పీవై రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 15 ఏళ్లుగా ఆయనతో అనుబంధం ఉందని.. ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చిందని చెప్పారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరికీ సుపరిచిత వ్యక్తే అన్నారు.
గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం..
నంద్యాల లోక్ సభ స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. ఒక్క రూపాయికి పప్పు, రొట్టె, ఒక్క రూపాయికి మజ్జిగ, ఒక్క రూపాయి అద్దెతో సాగునీటి సరఫరాకు పీవీసీ పైపు, బిందు సేద్యానికి సగం ధరకే సామగ్రి అందించడం మామూలు విషయం కాదని ఎస్పీవై రెడ్డి సేవలను కొనియాడారు. ఒక పారిశ్రామికవేత్త అలా చేయడం గొప్ప విషయమన్నారు. అందుకే ఆయన రైతు పక్షపాతిగా ప్రజల మనసుల్లో ఆయన చెరగని ముద్ర వేశారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments