ఈ గుండె ధైర్యం వాళ్లు ఇచ్చినదే.. : పవన్
- IndiaGlitz, [Saturday,July 06 2019]
'అమెరికాలో ఎన్ని ఆర్గనైజేషన్లు ఉన్నా మనందరం కలసికట్టుగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు మనకు మనమే సహాయం చేసుకోవాలి తప్ప బయటవాడు చేయడు' అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం 6గం.(భారత కాలమాన ప్రకారం)కు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తానా మహాసభల వేదిక నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) 22వ మహాసభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అమెరికా నలుమూలల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కొంతమంది రాజకీయనాయకులు కులాలను, మనుషులను విడదీయాలని చూస్తారు. నేను మాత్రం రాజకీయాల్లోకి వచ్చింది మనుషులను కలపడానికే. ఈ విధానం అపజయం ఇస్తే గర్వంగా తీసుకుంటాను తప్ప మనుషులను విడగొట్టే రాజకీయం చేయను. రాజకీయాల్లోకి వచ్చింది పతనమవుతున్నవిలువలు కాపాడటం కోసం, ధైర్యంగా సమస్యలను ఎలుగెత్తి చెప్పడానికే. అంతేగానీ స్కాములు, ద్రోహాలు చేయడానికి కాదు. జైళ్లలో కూర్చున్న వ్యక్తులు ఏ ఇబ్బంది లేకుండా సమాజంలో దర్జాగా తిరుగుతున్నప్పుడు... సత్యాన్ని మాట్లాడే వ్యక్తినైన నేనెందుకు ఓటమిని చూసి భయపడతాను. డబ్బుతో ముడిపడిన రాజకీయాల్లో మార్పు తీసుకురావడం చాలా కష్టమని తెలియదా..? డబ్బు ఖర్చు చేయకపోతే నేను కూడా ఓడిపోతానని తెలుసు, కానీ నమ్మిన సిద్ధాంతాల కోసం ఎన్ని బాధలైనాపడాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పటి నుంచి ఓటమి నాకు గొప్ప పాఠాలే నేర్పింది. ఓడిన ప్రతిసారి విజయం దగ్గరయింది. అందుకే ఓటమి అంటే భయం లేదు. జనసేన పార్టీ ఓటమి నుంచి కోలుకోవడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టింది. విలువలతో కూడిన పోరాటం చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా తెలుగురాష్ట్రాలకు, భారతదేశానికి అండగా నిలబడతాం. స్వామి వివేకానందుడి ప్రసంగాలు విని, పుస్తకాలు చదివి దేశ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని అనుకునేవాడిని. అయితే సమాజంలో కులాలు, మతాల మధ్య ఐకత్య లేకపోవడం చూసి ఆవేదన కలిగిచింది. దేశ సమగ్రతకే భంగం వాటిల్లుతుందని భయపడేవాడిని అని పవన్ చెప్పుకొచ్చారు.
ఈ గుండె ధైర్యం ప్రజలిచ్చిందే..!
విభజనకు ముందు - సొంత రాష్ట్రంలోనే ద్వితీయశ్రేణి పౌరులుగా బతకాల్సిన పరిస్థితులు చూసి బాధ కలిగి దేశాన్ని ప్రేమించేవాడిగా- పదవులు వస్తాయే లేదో తెలియదు, ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు, కానీ సరికొత్త తరానికి బలమైన గొంతు కావాలని చెప్పి జనసేన పార్టీ పెట్టాను. దాని కోసం ఎన్ని ఎదురుదెబ్బలైనా తినడానికి సిద్ధమయ్యాను. సినిమాల్లో డైలాగులు చెప్పడం వేరు, నిజ జీవితంలో మాట్లాడటం వేరు. నిజ జీవితంలో మాట్లాడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం ప్రజలు ఇచ్చిందే. ప్రజల అండే లేకపోతే నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలిగేవాడిని కాదు అని పవన్ కల్యాణ్ తెలిపారు.
నిమాలు మనుషులను మార్చలేవని...!
ఖుషి సినిమా వంద రోజుల ఫంక్షన్‌లో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ చేయకుండా ఉందాం, ఎంతమంది చేయకుండా ఉంటారో చేతులెత్తండి అంటే ఒక్కరు కూడా చేతులెత్తలేదు. చేతులెత్తితే ఈవ్ టీజింగ్ చేయకుండా ఉండాలని భయపడ్డారు. అప్పుడర్థమైంది సినిమాలు మనుషులను మార్చలేవని, రాజకీయాలను ప్రభావితం చేయలేవని. సమాజం పట్ల ప్రేమ ఉంటే బయటకొచ్చి ఏదో ఒకటి చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి తగ్గి సమాజాన్ని చదవడం మొదలుపెట్టాను. సక్సెస్ కోసం ఎంత సహనంతో వెయిట్ చేస్తానంటే.. ఖుషి తర్వాత నాకు దొరికిన సక్సెస్ గబ్బర్ సింగే. దాదాపు 10 ఏళ్లు సక్సెస్ కోసం సహనంతో నిరీక్షించాను. ఓటమిని తట్టుకుని ఎలా నిలబడాలి అని నెల్సన్ మండేలా రాసిన లాంగ్ వాక్ టూ ఫ్రీడమ్ పుస్తకం చదివి నేర్చుకున్నాను. సక్సెస్ కోసం సహనంతో వేచి చూస్తాను. కష్టపడతాను. విజయం పొందే అవకాశం వస్తుంది అని పవన్ కల్యాణ్ చెప్పారు.
ఎవరూ కబంధ హస్తాల్లో బంధించలేరు!
పాలకులు పాలకుల్లా ఉండాలి తప్ప నియంతలా ఉండకూడదు. నియంతలా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి, అభివృద్ధి ఎలా జరుగుతుంది. భారతదేశం నాయకుడిని ప్రేమించే దేశం తప్ప, నాయకుడిని చూసి భయపడే దేశం కాదు. నాయకులను చూసి భయపడుతున్నారంటే కచ్చితంగా ఏదో ఒక రోజు ఆ నాయకుడు పతనమవ్వడం ఖాయం. భయపెట్టి పాలిస్తామంటే భయపడటానికి ఇది మామూలు దేశం కాదు, భారతదేశమని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశాన్ని ఎవరూ కబంధ హస్తాల్లో బంధించలేరు. ప్రజలు నాయకుడిని ప్రేమిస్తే గాంధీగారిని గుండెల్లో పెట్టుకున్నట్లు పెట్టుకుంటారు. ద్వేషిస్తే అంతే వేగంగా పక్కనపెడతారు. దెబ్బతిని కూడా ఇక్కడ నిలబడ్డానంటే నాకు దేశం, సమాజం మీద ఉన్న ప్రేమే కారణం. ఏ రాజకీయ పార్టీ అయినా కుల సంఘంలా మారకూడదు. కులాలు, మతాల వారిగా విడిపోతే దేశం నష్టపోతుంది. తద్వారా సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. డబ్బులిచ్చి ఓట్లు కొంటున్నారు. దాని వల్ల ప్రజల్లో నైతిక బలం పోతుంది. ఓట్లు కొనుగోలు చేసే నాయకులకు ప్రజల మీద గౌరవం ఉండదు. డబ్బులిచ్చాం కదా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పాలన చేస్తారు. ఇలాంటి సమాజం రాకుండా ఉండాలంటే ఓటుకు నోటు మంచిది కాదనే మెసేజ్ ను ఎన్నారైలు పల్లెల్లో బలంగా తీసుకెళ్లాలి అని పవన్ పిలుపునిచ్చారు.
కులాలుగా... మతాలుగా విడిపోవాలా?
తానా సభలకు వెళ్తున్నానంటే రావొద్దని కొందరు, వెళ్లొద్దని మరికొందరు మాట్లాడం చాలా బాధేసింది. మనందరం ఒకటి కాదా..? మనం తెలుగువాళ్లం కాదా..? భారతీయులం కాదా..?. కులాలుగా, మతాలుగా విడిపోవాలా..? ప్రాంతీయ విద్వేషాలతో కొట్టుకోవాలా? ఇదా మన సంస్కృతి మనకు నేర్పింది. గాంధీజీకి నమస్కరించి- నా కులం నా మతం అని తిట్టుకుంటే ఎలా? కులాలను కలిపే ఆలోచన నా సిద్ధాంతాల్లో ఒకటి. ఇలా చేస్తే నువ్వేం రాజకీయవేత్తవని కొందరు అంటారు. వాళ్లను నేను ఒకటే చెబుతున్నాను. నేను రాజకీయవేత్తను కాదు మనిషిని. మనుషుల మనసులను నమ్మేవాడిని, మానవత్వం నమ్మేవాడిని. రాజకీయ లబ్ధి కోసం మనుషులను విడగొట్టి నిలబడాలి అనుకోను. విడివిడిగా వెళ్లిపోతుంటే సమాజం విచ్ఛినం అయిపోతుంది. భారతజాతి సమగ్రత కోసం, మనదైన తెలుగు సంస్కృతి కోసం మనందరం కలిసే ఉండాలి. అమెరికాలో విద్యార్ధులను అరెస్టు చేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడాను. వ్యక్తులు ఏ కులామో, ఏ మతమో, ఏ ప్రాంతమో నాకు తెలియదు. నాకు తెలిసింది వాళ్లు నాతోటి భారతీయులు అని మాత్రమే. దాని వల్ల ఓట్లు పడొచ్చు, పడకపోవచ్చు, ప్రభుత్వాలు రాకపోవచ్చు. నేను ఓడిపోవచ్చు. నాకు ఇబ్బంది లేదు. విలువలను నిలబెట్టినంత కాలం నేను చాలా గర్వంగా తలెత్తుకొనే తిరుగుతాను, గర్వంగా నిలబడే మాట్లాడతాను అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాను సమాజ హితం కోసం వాడాలి
మన సంస్కృతి కులాలతో ముడిపడిపోయింది. మనదేశంలో చెత్తను వేసేయడానికి సిద్ధపడతాము కానీ తీయడానికి సిద్ధపడం. దానికి కారణం కులం ఒప్పుకోదు. ఆ సంస్కృతి పోనంత వరకు అమెరికాలాంటి పెద్ద దేశాలతో పోటీపడటం కష్టమే. సోషల్ మీడియాను- వ్యక్తులను కించపరచడానికి కాకుండా సమాజం హితం కోసం వాడండి. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలా ఉండాలన్నదానిపై డిబేట్లు పెట్టండి. అంతే తప్ప నేను తానా సభకు వెళ్లడంపై చర్చలు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కొందరు ఎన్నారైలు అడుగుతున్నారు మీకు డబ్బు ఎంత ఇవ్వాలని అడుగుతున్నారు. నేను వాళ్లకు ఒకటే చెబుతున్నాను- డబ్బుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. మంచి సమాజం నిర్మించడానికి మీ మనసు ఇవ్వండి చాలు. విచ్ఛిన్నం అయిపోతున్న సమాజంలో మన బిడ్డలు పెరగడం మంచిది కాదు. సమాజానికి ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప, రాజకీయాల నుంచి ఏదో తీసుకెళ్లడానికి రాలేదు.
మీ సలహాలు, సంప్రదింపులు తీసుకుని మరింత ముందుకెళ్తాం. దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తాం. సమాజం బాగుండాలని ప్రజలను ప్రభావితం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నాకు కొత్తగా పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు. అమెరికాలోని మరికొన్ని నగరాల్లో త్వరలో పర్యటించి తెలుగువారితో మమేకమవుతాను. మీ అందరి ఆశీస్సులు జనసేనకు కావాలి అని పవన్ అన్నారు.