బాంబులేసినా చ‌లించ‌నంత బ‌లం నా దగ్గరుంది: పవన్

  • IndiaGlitz, [Tuesday,January 08 2019]

తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఫలానా సమస్య ఉందని జనసేనను సంప్రదిస్తే చాలు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనవంతుగా పరిష్కార మార్గం చూపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. శ్రీకాకుళం ఉద్ధానం విషయంలో నిరూపితమైంది.. ఇందులో ఎలాంటి సందేహాల్లేవ్. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ ఇప్పటి వరకూ పలు సమస్యలపై పోరాడారు.. అంతేకాకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల అవినీతిని సైతం ఎండగడుతూ వస్తున్నారు. త్వరలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పవన్ జిల్లాల బాటపట్టారు. మంగళవారం నాడు అనగా జనవరి 08న కర్నూలు జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సమస్యలతో పాటు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. ప్ర‌తి స‌మ‌స్య మీదా నేను బ‌లంగా మాట్లాడుతున్నా.. పోరాడుతున్నా దాన్ని జ‌నంలోకి తీసుకెళ్లేందుకు మ‌న‌కి మీడియా లేదు. ఇన్ని వ్య‌తిరేక శ‌క్తుల మ‌ధ్య పోరాటం చేస్తున్నాం అంటూ జనసేనాని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హత్తిబెళ‌గ‌ళ్ పేలుళ్లు ఘటనను గుర్తుతెచ్చుకున్న ఆయన బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు బ‌య‌లుదేరిన‌ప్పుడు క‌ర్నూలులో జ‌నం రార‌ని తనకు చెప్పారని కానీ రోడ్లు ప‌ట్ట‌నంతగా జ‌నం వ‌చ్చిన‌ప్పుడు స‌గ‌టు కుటుంబాలు ఏ స్థాయిలో మార్పు కోరుకుంటున్నాయో తనకప్పుడు అర్థమైందన్నారు.

జనం మనవైపే చూస్తున్నారు!

2001 నుంచే ప్ర‌జ‌లు మార్పు కోరుకోవడాన్ని నేను చాలా దగ్గర్నుంచి గ‌మ‌నించాను. ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌స్థ మీద విసుగుతో జ‌నం మ‌నవైపే చూస్తున్నారు. మ‌నం ఏదో చేస్తామ‌న్న ఆశ‌తో మ‌న కోసం వ‌స్తున్నారు. వ‌చ్చే జ‌నాన్ని శ‌క్తిగా మ‌ల‌చుకోవాలి. 2014లో అతికొద్ది మందితో పార్టీ ప్రారంభించాక‌.. ఇంత మంది అభిమానం చూర‌గొన‌డానికి రాజ‌కీయాల‌పై ఉన్న వ్య‌తిరేక‌తే కార‌ణం. పాల‌కులు అందుబాటులో ఉన్న వ‌న‌రుల్ని అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మ‌య్యే రీతిలో పంచితే ఇలాంటి ప‌రిస్థితులు ఉత్ప‌న్నం కావు. అంద‌రికీ స‌మాన‌మైన రీతిలో ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల‌న్న‌దే జ‌న‌సేన ల‌క్ష్యం. నాయ‌కుల‌కి కోట్ల రూపాయిలు దోచేయ‌డంలో ఉన్న తెలివితేట‌లు, శ్ర‌ద్ధ‌, యువ‌త‌కి ఉపాధి క‌ల్పించ‌డంలో ఉండ‌వు. రాజ‌కీయాల్లో ఓ స్థాయికి రావాలంటే క‌నీసం ఓ ద‌శాబ్దం ఓపిక ఉండాలి. కొత్త నాయ‌క‌త్వం రావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అయితే కొత్త‌వారు ఎంత వ‌ర‌కు నిల‌బ‌డ‌తారు అన్నదే అస‌లు స‌మ‌స్య‌. దెబ్బ కొడితే అంత‌కు మించి బ‌ల‌మైన పోరాటం చేసే శ‌క్తి ఉన్న‌వారు కావాలి. అలాంటి వారిని గుర్తించాలంటే.. త‌యారు చేయాలంటే కొంచెం స‌మ‌యం కావాలి అని జనసైనికులతో పవన్ అన్నారు.

టీడీపీ వైసీపీకి సిద్ధాంతాల్లేవ్..!

సిద్ధాంత బ‌లం లేకుండా నాయ‌కుల బ‌లం మీద ఆధార‌ప‌డి న‌డిచే పార్టీలు ఎక్కువ కాలం నిల‌బ‌డ‌లేవు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల‌కి ఎలాంటి సిద్ధాంతాలు లేవు. జ‌న‌సేన పార్టీకి మాత్రం చాలా బ‌ల‌మైన సిద్ధాంతాలు ఉన్నాయి. స్థానిక ప‌రిస్థితులు అర్ధం చేసుకోకుండా రాజ‌కీయాలు చేయ‌లేం. కులాల కాన్సెప్ట్‌తో అస‌లు న‌డ‌ప‌లేం. నా బ‌లం, బ‌ల‌హీన‌త రెండూ నాకు తెలిసినంత‌గా ఎవ్వ‌రికీ తెలియ‌దు. అందుకే నేను ఎలాంటి ప‌రిస్థితుల‌కి అయినా త‌ట్టుకుని చాలా బ‌లంగా నిల‌బ‌డగ‌ల‌ను. 2003 నుంచి రాజ‌కీయాల కోసం పూర్తి స్థాయిలో సంసిద్ధమ‌య్యా. కొత్త వారికి అవ‌కాశం ఇవ్వాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ప్పుడు మెజారిటీ శాతం కొత్త‌వారే ఉండాల‌న్న ల‌క్ష్యంతోనే 60 శాతం సీట్లు ఇస్తాన‌ని చెప్పాను. 60 శాతం కొత్త వారికి.. 20 శాతం భావ‌జాల బ‌లం ఉన్న‌వారికీ.. మ‌రో 20 శాతం విలువ‌ల‌తో కూడిన నాయ‌కుల‌కీ ఛాన్స్ ఇవ్వాల‌ని భావిస్తున్నాం అని పవన్ స్పష్టం చేశారు.

బాంబులేసినా చలించనంత బలముంది..!

2019 ఎన్నిక‌లు మొద‌టి పోరాటం మాత్ర‌మే. ఇదే ఆఖ‌రి పోరాటం మాత్రం కాదు. భావ‌జాలం ఉన్న‌వాడికి బ‌లం ఉంటుంది. బాంబులు వేసినా చ‌లించ‌నంత బ‌లం ఉంటుంది. అలాంటి బ‌లం నా ద‌గ్గ‌ర ఉంది. మ‌న ల‌క్ష్యం కోసం ఇప్పుడు పోరాటం చేద్దాం. అది త‌గ్గి చేయాల్సిన స‌మ‌యంలో త‌గ్గే చేద్దాం. నిజ‌మైన పోరాటం చేయాల్సిన‌ప్పుడు మీ అంద‌రి కంటే ముందు నేనే నిల‌బ‌డ‌తా అని జనసైన్యానికి పవన్ భరోసా ఇచ్చారు.

175 స్థానాల్లో పోటీ!

రాజ‌కీయాల్లో రెండు ర‌కాల శ‌క్తులు ఉంటాయి. ఒక‌టి పాల‌సీ మేకింగ్ అయితే, రెండోది మాస్ ఫాలోయింగ్‌. జ‌న‌సేన‌కి అన్నీ రెండు ర‌కాల బ‌లం ఉన్న‌వారు కావాలి. కొత్త పార్టీ అంటే అంతా కొత్త నాయ‌కులే ఉన్నా నిల‌బ‌డలేం. అనుభ‌వం, మ‌న సిద్ధాంతాల‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్న సీనియ‌ర్ల అవ‌స‌రం కూడా ఉంది. 175 స్థానాల్లో పోటీపై నాకు స్ప‌ష్ట‌త ఉంది. ఎన్ని స్థానాల్లో కొత్త‌వారికి అవ‌కాశాలు ఇవ్వాలి అన్న అంశం మీదా స్ప‌ష్ట‌త ఉంది. అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సుదీర్ఘ ప్ర‌యాణానికి సిద్ధ‌మ‌య్యా. అన్ని స్థానాల్లో గొప్పవారిని నిల‌బెట్టాల‌న్న కాంక్ష నాకూ ఉంది. గొప్ప అంటే ఆస్తిలో కాదు. గొప్ప ఆశ‌యాలు ఉన్న‌వారిని.. స్థానికంగా కూడా నాలా ఆలోచించే నాయ‌కుల్ని త‌యారు చేయాలి అని నేతలకు, కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు.

More News

సైరా రిలీజ్ గురించి చెప్పిన చెర్రీ

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర

ఈబీసీలకు 10% రిజర్వేషన్లపై చంద్రబాబు స్టాండ్ ఇదీ..

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

జగన్‌ పై దాడి కేసు: ఎన్ఐఏ గుట్టు విప్పబోతోందా..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్‌‌ఐఏ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు ఎన్ఐఏకు చేరింది.

టీడీపీకి షాక్.. జగన్ సమక్షంలో వైసీపీలోకి బుద్ధా..!

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో నేతలు జంపింగ్‌‌లు చేస్తున్నారు. ఏ పార్టీ అయితే తమను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందో అక్కడికెళ్లి వాలిపోతున్నారు.

వైఎస్ జగన్‌‌కు సడన్ షాకిచ్చిన సూపర్‌స్టార్ ఫ్యామిలీ..!

వైసీపీకి మహేష్ బాబు అభిమానులు దూరం కానున్నారా...? ఒకప్పుడు వైసీపీకి అండగా ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు తప్పని పరిస్థితిలో టీడీపీకి సపోర్ట్ చేయాల్సి వస్తుందా..?