చిరంజీవి, నన్ను చూసి అలా అనుకున్నారేమో: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య నేతృత్వంలోని బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం పవన్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ను అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం తీసేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, హరిరామ జోగయ్య వంటి కొంతమంది వ్యక్తులను చూసి ఆ కులానికి రిజర్వేషన్ అవసరం లేదనుకున్నారేమో? కాపు కులంలో 15 నుంచి 20 శాతం మందిని పక్కన పెడితే 80 శాతం మంది దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. కాపులు బలపడకూడదని తూర్పు కాపులుగా, తెలంగాణలో మున్నూరు కాపులుగా కొన్ని దశాబ్దాల కిందటే విడదీశారు. కాపు, ఒంటరి, బలిజ కులాల మధ్య తగదాలు పెట్టారు. రాజకీయ శక్తులు నిరంతరంగా చేస్తున్న దాడులను అందరూ గుర్తించాలి. బలమైన ఐక్యత తీసుకొచ్చే ప్రక్రియ జరగాలి. ఏడు దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న ఎందుకు వెనకబడిపోయామో కాపుల్లో ఆత్మపరిశీలన జరగాలి. రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకునే బలమైన సమూహం ఉండి కూడా రాజ్యాధికారాన్ని శాసించే కొన్ని శక్తులకు ముడిసరుకుగా ఉపయోగపడుతున్నాం’’ అన్నారు.
దామోదరం సంజీవయ్య గారిని గుర్తుంచుకోవాలి
1891 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం కులాల ఆధారంగా జనాభా లెక్కలు మొదలు పెట్టడంతో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. రాజ్యాంగం ఏర్పడి, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయే వరకు కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలు బీసీల్లోనే ఉండేవి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నీలం సంజీవరెడ్డి కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారు. తర్వాత శ్రీ దామోదరం సంజీవయ్య గారు రిజర్వేషన్లు పునరుద్దరించారు. కాపులు దళితవర్గం నుంచి వచ్చిన గొప్ప నేత, ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ దామోదరం సంజీవయ్య గారిని గుర్తుంచుకోవాలి. ఆ తరవాత కొన్ని రాజకీయ శక్తుల కుయుక్తుల వల్ల బీసీ రిజర్వేషన్ కొనసాగలేదు. ఈ సమయంలోనే కాపు కులంలో విభజించు, పాలించు అనే సిద్ధాంతం మొదలైంది. అది ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. తూర్పు కాపులు, మున్నూరు కాపులు అని విడదీశారు. ఇప్పటికీ విడదీస్తూనే ఉన్నారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని ఎవరూ ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు. చంద్రబాబు గారు కాపులు ఓసీలా, బీసీలా అనే మీమాంశలో పడేస్తే.. జగన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ముందుగా కాపుల్లో చలనం వచ్చి, మథనం జరిగితే తప్ప రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేము.
అట్టడుగు వర్గాలను నలిపేస్తున్నారు
నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో రామ్ మనోహర్ లోహియా గారు ఒకరు. ఆయన్ను అపారంగా గౌరవిస్తాను. ఆయన రాసిన భారతదేశంలో కులాలు అనే పుస్తకం నన్ను బలంగా హత్తుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కులాలకు వెనకబాటుతనం, కాపుల గురించి ఆయన ప్రస్తావించిన విధానం, మిగతా కులాలను కలుపుకొని ఎలా ముందుకు వెళ్లాలని ఆయన చెప్పిన విధానం నన్ను లోతుగా అధ్యయనం చేసేలా చేసింది. రాజకీయంగా శాసించే శక్తులు, చట్టాలను చేతుల్లోకి తీసుకున్న కొంతమంది వ్యక్తులు అట్టడుగు వర్గాలను నలిపేస్తున్నారు. కాపులకు సాధికారిత వచ్చిన రోజున దళితులు, బీసీలు మిగత వెనుకబడిన కులాలకు వీళ్లందరి నుంచి విముక్తి లభిస్తుందని లోహియా గారు ఆ పుస్తకంలో రాశారని పవన్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments