మూడు రాజధానులపై పవన్ ఏమన్నారంటే...

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

ఏపీలో శుక్రవారం చోటు చేసుకున్న కీలక పరిణామంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదముద్ర వేశారు. దీనిపై పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రాజధానులకు ఇది సమయం కాదని.. ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలని సూచించారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్, చత్తీస్ గడ్ రాజధాని రాయఘడ్‌ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారని పవన్ తెలిపారు. 33 వేల ఎకరాలు కావాల్సిందేనని జగన్ శాసనసభలో గట్టిగా మాట్లాడారని, రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పింది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు.

రెండు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన తరుణంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని పవన్ వెల్లడించారు. రైతుల పక్షాన జనసేన తుదికంటూ పోరాడుతుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రోజుకు పదివేల కేసులు నమోదవుతున్న ప్రమాదక పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల అంశాన్ని పక్కనబెట్టి కోవిడ్ నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర మంత్రివర్గం, ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని కోరారు.