Janasena :జనసేన పదేళ్ల ప్రస్థానం.. ఆవిర్భావ సభలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేనా, పవన్ ఏం చెప్పబోతున్నారు..?
- IndiaGlitz, [Tuesday,March 14 2023]
ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం తర్వాత .. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో శూన్యత మధ్య రాజకీయాల్లోకి ప్రవేశించారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. 2014 మార్చి 13న హైదరాబాద్ హైటెక్స్‌లో జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. పార్టీ పెట్టిన మొదట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ కూటమికి మద్ధతు ప్రకటించి వారి విజయం కోసం కృషి చేశారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా ప్రచారం చేశారు. తర్వాత టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్నప్పటికీ ఎలాంటి పదవులు తీసుకుకుండానే ముందుకెళ్లారు పవన్. అయితే 2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల , సమస్యల పట్ల .. టీడీపీ, బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఆ రెండు పార్టీలకు దూరమైన ఆయన ఆ ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. జనసేన పార్టీ అభ్యర్ధులు చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోగా.. స్వయంగా పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల (గాజువాక, భీమవరం)లలో ఓడిపోయారు. రాజోలులో గెలిచామని అనుకునేలోపు.. వున్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం వైసీపీ మద్ధతుదారుగా మారిపోయారు.
రాజకీయాల్లో రాటుదేలిన పవన్ :
ఈ పదేళ్ల కాలంలో రాజకీయంగా పవన్ రాటుదేలారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. తను సినిమాలు చేసుకుంటూనే, సమయం కుదిరినప్పుడల్లా రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తున్నారు. జనసేన ప్రస్థానంలో 2024 ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా వుంటూ, సొంత డబ్బు , అభిమానుల చందాలతో ఇన్నిరోజులు పార్టీని నడిపిస్తూ వస్తున్నారు పవన్. ఈసారి మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ అధికారంలోకి రావాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. సొంతంగా కుదరకపోయినా పొత్తులు ద్వారానైనా సీఎం పీఠాన్ని అధిష్టించాలని పవన్ చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని అంటున్న జనసేనాని.. తనకు రాజ్యాధికారం కావాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు.
ఈ ప్రశ్నలకు ఆన్సర్ దొరికేనా :
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పదవ వార్షికోత్సవ సభలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నిన్న మొన్నటి వరకు పొత్తులపై కాస్త అటు ఇటుగా వున్న ఆయన.. మొన్న ఒక్కసారిగా మాట మార్చారు. తాము ఏ పార్టీకి పల్లకి మోసేది లేదని, తాను మెత్తగా కనిపిస్తాను కానీ, మెత్తటి మనిషిని కాదని తేల్చి చెప్పేశారు. పవన్ యాత్ర చేస్తారంటూ గతేడాది కాలంగా వినిపిస్తోంది. ఇందుకోసం వారాహిని కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు మచిలీపట్నం వేదికగానైనా పవన్ యాత్రపై, పొత్తులపై స్పష్టత ఇస్తారేమో చూడాలి. అన్నింటికి మించి ఏపీ కంటే ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరి అక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది.. ఎవరితో పొత్తు పెట్టుకునే అంశంపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం వుంది. ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాల కోసం జనసైనికులతో పాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. మరి వాటన్నింటిపై పవన్ ఎలాంటి ఆన్సర్ ఇస్తారో చూడాలి.