Chiranjeevi - Pawan: తమ్ముడేమో అలా.. అన్నయ్యేమో ఇలా , చిరంజీవి తీరుపై పవన్ అభిమానుల గుస్సా
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు. టాలీవుడ్‌లో అగ్ర కథానాయకులుగా ఎదిగిన వీరిద్దరి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అయితే వీరిద్దరి మనస్తత్వాలు విభిన్నం. చిరంజీవి మృదు స్వభావి . ఎవరిని నొప్పించక తన పని తాను చేసుకుపోయే తత్వం. ఇక పవన్ విషయానికి వస్తే ఆయన దూకుడుకు మారుపేరు. ఇదే ఆయనను మిగిలిన హీరోల కంటే భిన్నంగా నిలబెట్టింది. హీరోగానే కాకుండా మానవతావాదిగా పవన్ జనానికి బాగా దగ్గరయ్యారు. ఆపదలో వున్న వారిని ఆదుకునే వరకు పవన్ కల్యాణ్‌కు నిద్రపట్టదు. ఈ క్రమంలోనే సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందే అన్నయ్య పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి ఆయన సారథ్యం వహించారు. అయితే కొన్ని కారణాల వల్ల చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. దీనిని పవన్ జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు కూడా వచ్చాయని ఫిలింనగర్‌లో ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు.
2024 ఎన్నికలపై పవన్ వ్యూహాత్మక అడుగులు :
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వ్యవస్థలను మారుస్తానంటూ జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. అప్పటి సార్వత్రిక, ఏపీ ఎన్నికల్లో పోటీ చేసేంత సమయం లేకపోవడంతో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ మద్ధతిచ్చారు. ఆ తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేయగా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం పక్కగా అడుగులు వేస్తున్నారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ ఈ దిశగా పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు పవన్‌కు బహిరంగంగా మద్ధతు పలకని అన్నయ్య చిరంజీవి.. మొన్నామధ్య తన తమ్ముడు గొప్ప స్థాయికి వెళితే చూడాలని వుందన్నారు.
టికెట్ల రేట్ల తగ్గింపుపై యుద్ధం చేసిన పవన్ :
అయితే చిరు వ్యవహారశైలి కారణంగా పవన్ , జనసైనికులు ఇబ్బందులకు గురవుతున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేనాని విమర్శలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ వున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఏ చిన్న ఇష్యూ జరిగినా పవన్ కల్యాణ్ వెంటనే స్పందిస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం జగన్‌కు విధేయంగా కనిపిస్తున్నారు. అప్పట్లో టికెట్ల రేట్లు, థియేటర్ల సమస్యపై పవన్ పెద్ద యుద్ధమే చేశారు. తీరా చిరంజీవి మాత్రం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌ను కీర్తిస్తూ మాట్లాడారు. ఇది జనసైనికులకు, పవన్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.
వాల్తేర్ వీరయ్య యూనిట్‌ను ఇబ్బంది పెట్టిన జగన్ సర్కార్:
ఆ వివాదం సద్దుమణగగా.. లేటెస్ట్‌గా వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వ్యవహారంలో కూడా మరోసారి చిరంజీవి తీరు విమర్శించే విధంగా వుంది. విశాఖలో చిత్ర యూనిట్ కోరుకున్న చోట ఫంక్షన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వక ఇబ్బంది పెట్టింది. రెండుసార్లు తిరస్కరించిన తర్వాత చివరికి ఓకే చెప్పారు. తీరా ఈవెంట్‌లో మాట్లాడిన చిరు.. ప్రభుత్వ తీరును ఎక్కడా ఖండించలేదు. అసలు ఆ విషయాన్నే ఆయన ప్రస్తావించలేదు. పైగా విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటానంటూ చెప్పారు. జగన్ విశాఖను అభివృద్ధి చేశారనే అర్ధం వచ్చేలా, ముఖ్యంగా మూడు రాజధానులకు చిరంజీవి మద్ధతుగా నిలిచినట్లుగా ఈ మాటలు జనంలోకి తప్పుడు సంకేతాలను పంపాయి.
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించిన పవన్:
ఇప్పటికే జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని పవన్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీనిపై పలు సందర్భాల్లో బాహాటంగానే ఆయన విమర్శలు చేశారు. ఇలాంటి దశలో చిరంజీవి మాటలు పవన్‌ను ఇబ్బంది పెట్టేలా వున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్, చిరు అభిమానుల మధ్య గ్యాప్ వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ప్రభావం వాల్తేర్ వీరయ్యపై పడే అవకాశం వుందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి రెండ్రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments