దారుణం: యశోదా ఆస్పత్రిలో రోగి కిడ్నీ మాయం

  • IndiaGlitz, [Thursday,March 07 2019]

ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు.. ప్రాణాలు తీస్తున్నారు.. మరికొందరు తాము వైద్యులమనే విషయం మరిచి కాసులకు కక్కుర్తి పడి చిల్లరపనులు చేస్తున్నారు. ఇలా ఒకరిద్దరు చేసే పాడు పనులకు యావత్ వైద్యరంగానికే చెరుగని ముద్ర పడిపోతోంది.!. హైదరాబాద్‌‌లోని మలక్‌‌పేట యశోద ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. రోగికి కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికెళితే.. కడుపులో ట్యూమర్ ఉందని చెప్పిన వైద్యులు.. కిడ్నీని మాయం చేశారు. అసలేం జరిగింది..? డాక్టర్లు ఎందుకింత కక్కుర్తి పడ్డారు అనే విషయాలు తెలుసుకుందాం.

అసలేం జరిగింది..!?

వివరాల్లోకెళితే.. భాగ్యనగరంలోని హయత్‌నగర్.. తారామతి పేటకు చెందిన శివ ప్రసాద్‌ అనే వ్యక్తి వారం రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన సమీపంలో ఉన్న మలక్‌‌పేట యశోదా ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో గడ్డ (ట్యూమర్)ఉందని దానిని తొలగించేందుకు సర్జరీ చేయాలని కుటుంబీకులకు చెప్పారు. సర్జరీ చేస్తే తమ బిడ్డకు అన్నీ సెట్ అవుతాయి కదా అని.. ఎంత ఖర్చయినా పర్లేదు బిడ్డ ఆరోగ్యం బాగైతే చాలని కుటుంబీకులు ఓకే అన్నారు. కుటుంబీకులు ఆ మాట చెప్పగానే రోగిని ఆపరేషన్ థియేటర్‌‌కు తీసుకెళ్లిన వైద్యులు వెంటనే సర్జరీ చేసి ట్యూమర్‌ను తొలగించారు. తొలగించిన ట్యూమర్‌ను శివప్రసాద్ తల్లిదండ్రులకు చూపించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా... అకస్మాత్తుగా శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో అసలేం జరిగిందో తెలియక కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. 

ట్యూమర్ అని చెప్పి కిడ్నీ మాయం చేశారు!

ఉన్నట్టుండి రోగిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏంటి సార్.. ఏమైంది..? మాకు ఎందుకు సమాధానమివ్వట్లేదు..? అని గట్టిగా రోగి బంధువులు అమెరికా నుంచి వచ్చిన డాక్టర్‌‌ ఉమాశంకర్‌ను అడిగారు. డాక్టర్ ఉమాశంకర్ శివప్రసాద్ కిడ్నీ ఒకటి తొలగించినట్లుగా తెలిపాడు. దీంతో అతని తల్లిదండ్రులు షాక్ తిన్నారు. ట్యూమర్ తీసేస్తామన్నారు.. తీసినప్పుడు కిడ్నీ అంతా బాగానే ఉందని చెప్పారు.. ఇప్పుడేంటి సార్ ఇలా చేస్తున్నారు.. అసలు మా అనుమతి లేకుండా కిడ్నీ ఎలా తీస్తారు అని డాక్టర్‌‌పై రోగి కుటుంబీకులు గొడవకు దిగారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోజే చికిత్సకోసం పదిలక్షలు రూపాయాలు చెల్లించామని అయినా ఈ డాక్టర్లు సరిగ్గా పట్టించుకోకపోగా కిడ్నీ కొట్టేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. మా బిడ్డ కిడ్నీని తొలగించి అమ్ముకున్నారని డాక్టర్లపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రోగి బంధువులు తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. తమకు తెలియకుండా కిడ్నీని తొలగించిన యశోద ఆస్పత్రి డాక్టర్ ఉమా శంకర్‌తో పాటు అతని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పైగా ఈ చికిత్స చేసింది.. అమెరికా నుంచి వైద్యుడు కావడం గమనార్హం.

ఉద్రిక్తత..

దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. మీడియా ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకోవడంతో ఆస్పత్రిలో అసలేం జరుగుతోందంటూ పెద్ద ఎత్తున జనాలు గుమికూడారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. జరిగిన విషయం మీడియా చెబుతూ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.. మరో కోపం కట్టెలు తెచ్చుకున్నంతగా వైద్యులపై కన్నెర్రజేశారు.

డాక్టర్స్ ఏమంటున్నారంటే..

శివప్రసాద్‌కు కడుపులో గడ్డకు కేన్సర్‌ వ్యాధి సోకింది. వ్యాధి రెండు కిడ్నీలకు వ్యాపించనందునే కిడ్నీ తొలగించాల్సి వచ్చింది. దీనిపై రోగి బంధువులకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఆపరేషన్‌ చేశాము. పేషెంట్‌ బంధువుల ఉద్దేశపూర్వకంగానే ఆందోళన చేస్తున్నారు అని యశోద ఆసుపత్రి పీఆర్‌ఓ అశోక్‌ వర్మ మీడియాకు వివరించారు. అయితే రోగి కుటుంబీకులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. కిడ్నీ తీసి అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు.

కాగా.. యశోదా ఆస్పత్రి ఇలా వార్తల్లోకెక్కడం ఇదేం మొదటి సారి కాదు.. ఇదివరకే పలు వివాదాల్లో వార్తల్లో నిలిచింది. అయినప్పటికీ ఆస్పత్రి పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కొందరు వైద్యులు యథావిథిగా తమ పని కానిచ్చేస్తున్నారు. తాము వైద్యులం.. ప్రాణాలను కాపాడి.. ప్రాణాలు పోయాల్సిన వాళ్లమని ఇకనైనా తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

More News

టాలీవుడ్ 'ముగ్గురు మిత్రులు' మళ్లీ కలిశారు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్, హీరో ప్రిన్స్, అక్కినేని యంగ్ హీరో అఖిల్ స్నేహితులన్న విషయం తెలిసిందే.

దిల్‌‌రాజుకు 'మే' సెంటిమెంట్ సరే.. మహేశ్ సంగతేంటి!?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌‌ దిల్ రాజు‌‌కు ‘మే’ నెల బాగా కలిసొచ్చింది. అందుకే ఆయన తాను ప్రొడ్యూసర్‌‌గా చేసిన సినిమాలు రిలీజ్ అయితే

బీజేపీ ఎమ్మెల్యేను బూటుతో కొట్టిన ఎంపీ..

జడ్పీటీసీ సమావేశాలు మొదలుకుని అసెంబ్లీ సమావేశాల వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఏ రేంజ్‌‌లో విమర్శల వర్షం కురిపించుకుంటారో మనందరం చూసే ఉంటాం.

చంపేస్తారా? చంపేయండి.. చావడానికి రె‘ఢీ’!

టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేనిపై వైసీపీ, జనసేన కార్యకర్తలు కొందరు సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో రెండు వేర్వేరు కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

కీలక నిర్ణయం: స్టీఫెన్ రవీంద్ర చేతికి ‘డేటా చోరీ’ కేసు

‘డేటా చోరీ’ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువుర్ని విచారించిన సైబరాబాద్ పోలీసులు.. ‘ఐటీ గ్రిడ్’ డైరెక్టర్‌ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.