Download App

Patel S.I.R Review

జ‌గ‌ప‌తిబాబు అభిమానుల్లో మ‌హిళ‌లు ఎక్కువ‌. ఫ్యామిలీ సినిమాలు వ‌రుస‌గా చేసి జూనియ‌ర్ శోభ‌న్ బాబు అనే బిరుదును కూడా పొందారు. అయితే ఉన్న‌ప‌ళాన `లెజెండ్‌`తో జ‌గ్గూభాయ్ విల‌న్‌గా మారారు. ఆ త‌ర్వాత విల‌న్ పాత్ర‌లే కాకుండా, కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ సెటిల‌య్యారు. యంగ్ హీరోల‌కు విల‌న్‌గానూ, ఫాద‌ర్‌గానూ న‌టిస్తున్న జ‌గ్గూభాయ్ దాదాపు ఐదేళ్ల త‌ర్వాత హీరోగా, అందులోనూ ద్విపాత్రాభిన‌యం చేసి, త‌న‌కు తానే హీరోగా న‌టించిన సినిమా `ప‌టేల్ సార్‌`. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందా? ఒక లుక్కేసేయండి మ‌రి.

క‌థ:‌

సుభాష్ ప‌టేల్ (జ‌గ‌ప‌తిబాబు) పూర్వీకులు మిలిట‌రీలో చేరి దేశానికి సేవ చేసిన వారు. ప‌టేల్ కూడా అలాగే దేశ సేవ కోసం సైన్యంలో చేరి కార్గిల్ యుద్ధంలో శ‌త్రువుల‌కు ఎదురెళ్లి బుల్లెట్ దెబ్బ‌ల‌ను తింటాడు. త‌న కుమారుడు వ‌ల్ల‌భ ప‌టేల్ (జ‌గ‌ప‌తిబాబు) కూడా త‌న‌లాగే దేశ సేవ చేయాల‌నుకుంటాడు. అత‌ను కుద‌ర‌ద‌ని స్ప‌ష్టంగా చెప్ప‌డంతో ఇంటి నుంచి బ‌య‌టికి పంపిస్తాడు. ఆ క్ర‌మంలో అత‌ను రాజేశ్వ‌రి (ప‌ద్మ‌ప్రియ‌)ను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు పుడ‌తారు. ఇంత‌లో వ‌ల్ల‌భ త‌ల్లి భార‌తి (ఆమ‌ని) క‌న్ను మూస్తుంది. ఆమె కోసం ఇండియాకు వ‌చ్చిన వ‌ల్ల‌భ ఓ యాక్సిడెంట్ కేసును డీల్ చేస్తాడు. దాని వ‌ల్ల అత‌ని జీవితంలో అనుకోని మార్పులు వ‌స్తాయి. అవి ఏంటి?  వాటి వ‌ల్ల ఏర్ప‌డ్డ ప‌ర్య‌వ‌సానం ఎలాంటిది? వ‌ల్ల‌భ తండ్రి ప‌టేల్ ఎందుకు రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది? న‌లుగురిని హ‌త‌మార్చాల్సిన అవ‌స‌రం అత‌నికి ఏముంది? వ‌ంటి అంశాల‌న్నీ ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్లు:

జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న బావుంది. తండ్రి సుభాష్ ప‌టేల్‌గా ఆయ‌న చెప్పే దేశ‌భ‌క్తి మాట‌లు, చూపే దేశ‌భ‌క్తి మెప్పిస్తాయి. త‌న కుటుంబానికి జ‌రిగిన ప‌గ‌కు ప్ర‌తీకారం తీర్చుకునే క్ష‌ణాల్లో ఆయ‌న‌లో తీవ్ర‌తను స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. త‌న తండ్రికి ద‌గ్గ‌ర కావాల‌నుకునే వ‌ల్ల‌భ ప‌టేల్‌గానూ, భార్య‌ను ఇష్టంగా చూసుకునే భ‌ర్త‌గానూ, చిన్న‌పిల్ల‌ల మ‌న‌సెరిగిన తండ్రిగానూ చాలా చ‌క్క‌గా న‌టించారు. పోలీసాఫీస‌ర్ కేథ‌రిన్‌గా న‌టించిన తాన్యా హోప్ తొలి షాట్‌లో బికినీ సీన్‌తో ఆక‌ట్టుకుంటుంది. తెలుగు సినిమాకు మ‌రో గ్లామ‌ర్ హీరోయిన్ దొరికింద‌నే కాన్ఫిడెన్స్ క‌లుగుతుంది. ఆమ‌ని, ప‌ద్మ‌ప్రియ‌, ర‌ఘుబాబు, పోసాని, సుబ్బ‌రాజు త‌మ పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు. రెండు పాట‌లు బావున్నాయి. విల‌న్ వేషాలు వేస్తున్న‌ప్ప‌టికీ త‌న‌కు లేడీస్‌లో ఫాలోయింగ్ త‌గ్గ‌లేద‌న్న‌ట్టుగా ఓ పాట‌ను జ‌గ‌ప‌తిబాబును ఉద్దేశించి రాసిన సాహిత్యం ఆక‌ట్టుకుంటుంది. కెమెరాప‌నిత‌నం మెప్పిస్తుంది. బేబీ డాలీ న‌ట‌న కూడా బావుంది. సెకండాఫ్లో చాలా స‌న్నివేశాల‌కు రీరికార్డింగ్ ప్ల‌స్ అయింది.

నెగ‌టివ్ పాయింట్స్:

సినిమా రొటీన్ రివేంజ్ డ్రామా కాబ‌ట్టి సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన‌, పెద్ద‌గా చెప్పుకోద‌గిన ట్విస్టులు ఏమీ క‌నిపించ‌వు. డ్ర‌గ్స్ మాఫియాకు, ఓ వైద్యుడికి, ఓ మిలిట‌రీ మేన్‌కి మ‌ధ్య పెట్టిన లింకు అంత గ‌ట్టిగా, ఎమోష‌న‌ల్‌గా అనిపించ‌దు. అవినీతికి అల‌వాటైన హీరోయిన్ చేత కూడా జండాకు సెల్యూట్ కొట్టించ‌డం ద‌ర్శ‌కుడి ప్ర‌తిభే. మాన‌సికంగా ఎవ‌రు ఎలాంటివారైనా, దేశం, జండా... వంటి విష‌యాల్లో స్ట్రిక్ట్ గా ఉంటార‌ని, ప్ర‌తి ఒక్క‌రిలోనూ దేశ‌భ‌క్తి ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు ఇంకో సారి చెప్పారు. అందుకు నిద‌ర్శ‌నం సినిమా మ‌ధ్య‌లో పాప జాతీయ‌గీతం పాడిన‌ప్పుడు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో లేచి నిలుచోవ‌డ‌మే.  ద‌ర్శ‌క‌డు లాజిక్స్ మిస్ అయ్యాడు. సినిమా స్టార్ట్ అయిన ప‌ది నిమిషాల‌కు సినిమా కథేంటో ప్రేక్ష‌కుడికి అవ‌గ‌త‌మై పోతుంది. సినిమాలో ప్రేక్ష‌కుడు ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూసే ఎలిమెంట్స్ ఏవీ లేవు. జ‌గ‌ప‌తిబాబు వ‌న్ మ్యాన్ షోలా సినిమాను ఆసాంతం అల‌రించాల‌ని చూసినా, ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడ‌నుకోవ‌డం పొర‌పాటే అవుతుంది.

స‌మీక్ష:

ముందు హీరోగా ఆక‌ట్టుకున్న జ‌గ‌పతిబాబు లెజెండ్ సినిమాతో విల‌న్‌గా మారిన‌ప్ప‌టి నుండి విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చాలా బిజీ అయిపోయాడు. అటువంటి జ‌గ‌ప‌తిబాబు హీరోగా న‌టిస్తున్న సినిమా అన‌డంతో ఆయ‌న అభిమానుల‌ను, ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కునే అంశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌నే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ సినిమాను ద‌ర్శ‌కుడు రివేంజ్ ఫార్ములాలోనే తీసుకెళ్ళాల‌నుకోవ‌డం బాధాక‌రం. కాస్తా కొత్త‌గా ఆలోచించి ఉంటే బావుండేది.  హీరోయిన్ తాన్యా అంద‌చందాల‌తో, బికినీ షోతో ఆక‌ట్టుకుంది. అయితే ఆమె పాత్ర‌గానీ, ర‌ఘుబాబు పాత్ర‌గానీ పెద్ద‌గా గుర్తుండ‌వు. పోసాని పాత్ర స‌రేస‌రి. ఇలాంటి పాత్ర‌ల్లో పోసాని చాలాసార్లు చేసేశాడు. రొటీన్ అయిపోతుంద‌నిపించింది. తండ్రీ కొడుకుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు, కాసింత దేశ‌భ‌క్తి త‌ప్పితే ఈ సినిమాలో చెప్పుకోద‌గ్గ అంశాలు మ‌రిన్ని క‌నిపించ‌వు.

బోట‌మ్ లైన్: ప‌టేల్ సార్‌... ప‌గ, ప్ర‌తీకారాల‌తో ష‌రా మ‌మాలుగా క‌న‌ప‌డ్డాడు

Patel SIR English Version Review

Rating : 2.3 / 5.0