అన్నగారిలానే పవన్‌ది బలమైన ఆశయం.. ఆయన కల నెరవేరాలి : పరుచూరి గోపాలకృష్ణ
- IndiaGlitz, [Wednesday,September 07 2022]
పవన్ కల్యాణ్.. సినిమాల్లో పవర్‌స్టార్, రాజకీయాల్లో జనసేనాని. సినిమాలను తగ్గించి నాయకుడిగా మారినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రాజకీయాలను మార్చాలని, పాలక పక్షాన్ని ప్రశ్నించే ఓ బలమైన గొంతుక వుండాలని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వుండాలని బలంగా విశ్వసిస్తారు పవన్ కల్యాణ్. తను కలలు కన్న సమాజమే లక్ష్యంగా సిద్ధాంతాలను రూపొందించి ఆచరణలో ముందుకు సాగుతున్నారు. మధ్యలో ఎదురుదెబ్బలు తగులుతున్నా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలోనే దిగ్గజ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. పవన్ కల్యాణ్ ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు.
ఎంతోమంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు.. పవన్ అలా కాదు:
పవర్‌స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని పరుచూరి తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఆశయం నెరవేరి.. చట్టసభల్లోకి పవన్ అడుగుపెట్టాలని గోపాలకృష్ణ ఆకాంక్షించారు. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని... ఎంతోమంది సినీనటుడు రాజకీయాల్లోకి వచ్చారని, ఏదో ఒక పార్టీలో వుండి చట్టసభల్లోకి అడుగుపెట్టాలని చూస్తారని పరుచూరి అన్నారు. కానీ సమాజాన్ని మార్చాలనే ఆశయం వేరని, ఇలాంటి ఆలోచనే గతంలో అన్న ఎన్టీఆర్‌లో బలంగా వుండేదని.. అలాంటి సంకల్పమే పవన్‌లోనూ వుందని గోపాలకృష్ణ కొనియాడారు. ఎవరు సహకరించినా.. సహకరించకున్నా తన రాజకీయ పోరాటాన్ని పవన్ కొనసాగిస్తున్నారని పరుచూరి అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కుని వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సాధించాలని పరుచూరి గోపాలకృష్ణ ఆకాంక్షించారు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా సామాజిక చిత్రాల్లో నటించాలని ఆయన పవన్‌కు సూచించారు.
పవన్ రాజకీయ ప్రస్థానం:
అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. నాటి కాంగ్రెస్ నేతలను పంచెలూడదీసి కొడతానన్న పవన్ డైలాగ్ బాగా పాపులరైంది. అయితే చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన కొద్దిరోజులకే మార్చి 14 , 2014న జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అయితేనే గాడిలో పెట్టగలరని భావించి టీడీపీకి మద్ధతిచ్చారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పవన్ కల్యాణ్ బరిలోకి దిగారు. అయితే పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. కానీ అధైర్యపడక పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెబుతున్న పవన్... ఈసారి తన సత్తా ఏంటో చూపిస్తానని తేల్చిచెబుతున్నారు.