జగన్ ప్రమాణానికి కార్యకర్తలెవరూ రాకండి!
- IndiaGlitz, [Tuesday,May 28 2019]
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆంధ్ర్రపదేశ్ ముఖ్యమంత్రిగా మే-30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలాంటి ఆడంభరాలకు పోకుండా సాదాసీదాగా ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు వచ్చి ఇబ్బంది పెట్టకుండా మీ ఇళ్లలోని టీవీల్లో వీక్షించి.. ఎన్నికలప్పుడు ఏవిధంగా అయితే ఆశీర్వదించారో.. ఈ కార్యక్రమాన్ని చూసి వైఎస్ జగన్‌ను నిండు మనసుతో దీవించండి అని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ప్రభుత్వంపై భారం పడకూడదనే ఆలోచనతో నిరాడంబరంగా ఇలా చేస్తన్నామని కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంపై భారం పడకుండా సాదాసీదాగా ప్రమాణస్వీకారం చేస్తున్నారన్నారు. ప్రమాణస్వీకారానికి వచ్చే ప్రజలు, అభిమానులు ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.
నిండు మనస్సుతో దీవించండి!
ఓట్లు వేసి నిండుమనస్సుతో వైసీపీని ఏ విధంగా ఆశీర్వదించారో.. అదే స్ఫూర్తితో ప్రజలంతా ఇంటి దగ్గర నుంచి ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వీక్షించాలని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులను కోరారు. ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలివచ్చేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారని, ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇంటి వద్ద నుంచే ప్రసారాలు చూస్తూ జగన్‌ని దీవించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రమాణ స్వీకారానికి వందల కోట్ల రూపాయల ఖర్చు చేసి ఆ ఖర్చును ప్రజల నెత్తిన రుద్దవద్దనే ఆలోచనతో సాదాసీదాగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తున్నారన్నారు.
కాగా.. ఎమ్మెల్యేల ప్రకటనతో కొందరు కార్యకర్తలు, అభిమానులు ఒకింత అసంతృప్తికి లోనైనప్పటికీ ఇది మంచి మాటే.. ఇంటి దగ్గర్నుంచే వీక్షించడం బెటర్ అని ఎక్కువ శాతం మంది అభిమానులు, కార్యకర్తలు అంటున్నారు. ఇదిలా ఉంటే 25 వేల మంది సరిపడేట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఏ మాత్రం తరలివస్తారో వేచి చూడాల్సిందే.