సెప్టెంబర్ 14 నుంచి ప్రత్యేక ఏర్పాట్ల నడుమ పార్లమెంట్ సమావేశాలు..
- IndiaGlitz, [Wednesday,August 26 2020]
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం లోక్‌సభ జరగనుండగా.. మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశాలు సెప్టెంబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 1 వరకూ కొనసాగనున్నాయి. కరోనా కారణంగా సమావేశాల నిర్వహణకు పలు జాగ్రత్తలను పాటించనున్నారు. సభ్యుల స్థానాలను కూడా భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రత్యే ఏర్పాట్లు చేస్తున్నారు. సభ్యులు సభా కార్యక్రమాలు వీక్షించేలా డిజిటల్ స్క్రీన్లు, కరోనా నివారణకు ఆల్ట్రావయొలెట్ క్రిమి సంహారక వ్యవస్థను సైతం ఏర్పాటు చేయనున్నారు.
మార్చ్ నెలలో బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ సమావేశాలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. ఆ తరువాత తిరిగి సెప్టెంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. 18 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభ సభ్యులు లోక్ సభ, రాజ్యసభల్లో కూర్చొననున్నారు. లోక్‌సభ సభ్యులు మాత్రం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మాత్రమే కూర్చొననున్నారు. ప్రతి ఎంపీ విధిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలనే నిబంధనను విధించారు. రాజ్యసభ సమావేశాలకు రెండు ఛాంబర్లతో పాటు గ్యాలరీని సైతం ఉపయోగించుకోనున్నారు. 60 మంది ఎంపీలు ఛాంబర్లో, మిగిలిన 132 మంది గ్యాలరీల్లో కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సభ్యులకు స్క్రీనింగ్ తోపాటు పార్లమెంటు నలుమూలలా శానిటైజేషన్ వ్యవస్థ ఉంటుందని అధికారులు తెలిపారు. సభ్యుల వ్యక్తిగత సిబ్బందిని మాత్రం లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఆ సెషన్స్‌లో రెండు సభల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టారు.
ఫైనాన్స్ బిల్లుతో పాటు బడ్జెట్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇరు సభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనకు అనుగుణంగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలోనూ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.