'పరిచయం' ఫస్ట్ వీడియో సాంగ్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా నటించిన చిత్రం 'పరిచయం'. ఓ యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రియాజ్ నిర్మించారు. శేఖర్ చంద్ర స్వరాలందించారు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ''అటు ఇటు అని ఏమైందో మనసా..'' అంటూ సాగే పాట తాలుకూ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు ముఖ్య అతిథులుగా దర్శకులు హరీష్ శంకర్, సుధీర్ వర్మ, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ''మంచి తెలుగు టైటిల్.. 'పరిచయం'. టీజర్ చూశా. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఇప్పుడు విడుదల చేసిన పాట కూడా చాలా బాగుంది. దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ముందుకెళుతున్నారు. హీరోహీరోయిన్ల జోడీ బాగుంది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.
సుధీర్ వర్మ మాట్లాడుతూ.. ''లక్ష్మీ కాంత్ దగ్గర 3 సినిమాలకు సహాయకుడిగా పనిచేశా. నేను నేర్చుకున్నదంతా ఆయన దగ్గరే. విజువల్స్ చాలా బాగున్నాయి. విరాట్, సిమ్రత్ జంట క్యూట్‌గా ఉంది'' అన్నారు.
బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''ఈ చిత్ర నిర్మాత రియాజ్ నాకు 2, 3 ఏళ్లుగా పరిచయం. ఇప్పుడు నేను నిర్మిస్తున్న 'హుషారు'లో ఆయన కూడా పార్టనర్‌గా వ్యవహరిస్తున్నారు. యు.ఎస్.లో తనకు బిజినెస్ ఉన్నా.. సినిమాల మీద ఆసక్తితో పరిశ్రమలోకి వచ్చారు. ఎప్పటికప్పుడు నా సలహాలు తీసుకుంటూ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. దర్శకుడు లక్ష్మీకాంత్ అన్నీ తానై ఉండి మంచి అవుట్‌పుట్ రాబట్టుకున్నారు.
చిత్ర సంగీత దర్శకుడు శేఖర్ చంద్రతో ఇప్పటికే నేను చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా కోసం తను అందించిన బాణీలు బాగున్నాయి. సినిమా చూశా. చాలా బాగా వచ్చింది. కెమెరామేన్ కొత్తవాడైనా మంచి విజువల్స్ అందించారు. హీరోహీరోయిన్ల జోడీ బాగుంది. పృథ్వీ చాలా రోజుల తరువాత చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఆయన కూడా మంచి పాత్ర చేశారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది'' అన్నారు.
శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ''పాటలు బాగా వచ్చాయి. పాటలన్నింటికి సాహిత్యం బాగా కుదిరింది. ఇప్పుడు విడుదల చేసిన పాటకు వనమాలి అందించిన సాహిత్యం.. ఆ పాటని మరోస్థాయికి తీసుకెళ్ళింది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. దర్శకుడు లక్ష్మీకాంత్ దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొత్త ఫీల్‌ని ఇస్తుంది'' అన్నారు.
కథానాయిక సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ.. ''ఇదొక ఇన్నోసెంట్ లవ్ స్టోరీ. ప్రతీ సన్నివేశం అలరిస్తుంది. యువతరాన్నే కాకుండా అన్ని వర్గాలను అలరించే ప్రేమకథ ఇది. నా పాత్ర అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు'' అన్నారు.
కథానాయకుడు విరాట్ కొండూరు మాట్లాడుతూ.. ''7, 8 ఏళ్లుగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా. ఈ సినిమాతో నా కల నెరవేరింది. తొలి అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రొత్సహించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్'' అన్నారు.
పృథ్వీ మాట్లాడుతూ.. ''నటుడిగా నాకిది 123వ సినిమా. అయినప్పటికీ అందరూ నన్ను 'పెళ్ళి' పృథ్వీ అనే పిలుస్తుంటారు. 7 ఏళ్ళ తరువాత నేను నటిస్తున్న తెలుగు చిత్రమిది. ఇందులో హీరోయిన్ ఫాదర్‌గా నటించా. ముఖ్యంగా రెండు సన్నివేశాలు నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. రేపు సినిమా చూస్తున్నప్పుడు తప్పకుండా ఆ సన్నివేశాలు మీకు నచ్చుతాయన్న నమ్మకం ఉంది.
దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి దర్శకుల శైలిలో లక్ష్మీకాంత్ చెన్నా పనితనం ఉంది. కులుమనాలి, వైజాగ్, అరకు వంటి అందమైన ప్రదేశాల్లో తీసిన సన్నివేశాలు కంటికింపుగా ఉంటాయి. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది'' అన్నారు.
నిర్మాత రియాజ్ మాట్లాడుతూ.. ''గత ఏడాది జూన్‌లో సినిమాని ప్రారంభించాము. దాదాపు ఏడాది పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. దర్శకుడు లక్ష్మీకాంత్.. కథకు తగ్గ వాతావరణం ఉండేలా చూసుకుని సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. లాస్ట్ మంత్ ఫస్ట్ కాపీ చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. నేను నిర్మాణ రంగంలోకి దిగుతున్నానని నా మిత్రులతో చెప్పినప్పుడు ''యు.ఎస్.లో బాగున్నావు కదా? ఎందుకు రిస్క్ తీసుకోవడం'' అన్నారు. అయితే వాళ్ళందరితో ఒకటే చెప్పా.. సినిమా మేకింగ్ అంటే ఇష్టం, ప్రాణం అని. మా కుటుంబ సభ్యులు సీడెడ్‌లో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.
ఓ మంచి సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగుతున్నందుకు సంతోషంగా ఉంది. అంతర్లీనంగా మంచి సందేశం ఉన్న ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమా నిర్మాణ సమయంలో బెక్కెం వేణుగోపాల్ అందించిన సహకారం మరువలేనిది. మా టీమ్ అంతా తామే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాము అన్నంతగా కష్టపడి పనిచేశారు. ఈ కార్యక్రమానికి అడగ్గానే విచ్చేసిన హరీష్ శంకర్, సుధీర్ వర్మగారికి కృతజ్ఞతలు. అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది'' అన్నారు.
చిత్ర దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ.. '' ప్రేమ అంటే ఏమిటి? అనే క్వశ్చన్ వేసుకుని.. ఈ సినిమా కథని ప్రారంభించాను. కొంతమంది యువతీయువకులను ప్రేమ గురించి అడిగితే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెప్పుకొచ్చారు. సరైన అభిప్రాయం మాత్రం రాలేదు. నాకు తెలిసి.. ప్రేమ అంటే ప్రాణం. మన ప్రాణానికి ఏమైనా అవుతుందంటే మనం ఏ రిస్క్ కూడా చేయలేము. ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ఎవరికైనా ఏదైనా చేయగలిగితే అదే ప్రేమ. ఒక తల్లి ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటూ బిడ్డకు జన్మనిస్తుంది. అదే.. ప్రేమంటే. అలా.. ప్రాణానికి మించి ప్రేమించే ప్రేమికుల కథనే మా 'పరిచయం' చిత్రంలో చూపించబోతున్నాం.
రెండు మనసుల మధ్య ప్రేమ పుట్టాలన్నా, రిలేషన్ ఏర్పడ్డాలన్నా పరిచయం ఉండాలి. ఎవరి పరిచయం ఎవరి జీవితాన్ని మలుపు తిప్పింది అనేదే ఈ చిత్ర కథాంశం. ఓ యధార్థ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మంచి ఫలితం కోసం అందర్నీ కష్టపెట్టాను. రేపు సినిమా విడుదలయ్యాక యూనిట్ మొత్తం హ్యాపీగా ఫీలవుతారన్న నమ్మకం ఉంది. బిజీ షెడ్యూల్స్‌లోనూ ఇక్కడకి వచ్చిన హరీష్ శంకర్, సుధీర్ వర్మ, బెక్కెం వేణుగోపాల్‌కు కృతజ్ఞతలు'' అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు నరేష్ రానా, ఆర్ట్ డైరెక్టర్ రాజ్‌కుమార్ గిబ్సన్, బేబి అసిన్, మాస్టర్ అయాన్, సురేష్ వర్మ, 'నందిని నర్సింగ్ హోమ్' నిర్మాత బిక్ష్మమయ్య తదితరులు పాల్గొన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు, రాజీవ్ కనకాల, శ్రీమన్నారాయణ, రాహుల్ రామకృష్ణ, పద్మజ లంక తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఎడిటర్: ప్రవీణ్ పూడి, కొరియోగ్రాఫర్స్: విజయ్ ప్రకాష్, హరికిరణ్, పోరాటాలు: రామకృష్ణ, సాహిత్యం: భాస్కరభట్ల, వనమాలి, శ్రీమణి, మాటలు: సాగర్, పి.ఆర్.వో: వంశీ - శేఖర్, ఆర్ట్; రాజ్‌కుమార్ గిబ్సన్, ఛాయాగ్రహణం; నరేష్ రానా, నిర్మాత; రియాజ్, రచన - దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com