Paper Boy Review
ఎదగడం అంటే తాను మాత్రమే ఎదగడం కాదు.. తనతో పనిచేసే, తన చుట్టూ ఉన్న నలుగురు కూడా ఎదగడం, వారి ఎదుగుదలకు సాయపడటం... ఈ సూత్రం దర్శకుడు సంపత్ నందికి చాలా బాగా తెలుసు. అందుకే తాను దర్శకత్వం వహించడం కుదరని స్క్రిప్ట్ లను స్వయంగా నిర్మిస్తున్నారు. గతంలోనూ కొన్ని చిత్రాలను నిర్మించిన సంపత్ నంది తాజాగా మాస్ పల్స్ ను టచ్ చేసేలా క్లాస్ కథతో తెరకెక్కించిన చిత్రం `పేపర్ బాయ్`. గ్రౌండ్ లెవల్లో టీమ్ అంతా పబ్లిసిటీలోనూ పాల్గొన్నారు. ఆ కృషి ఎంత వరకు ఫలించింది? థియేటర్లకు జనాలను ఎంతమాత్రం రప్పించింది..? జస్ట్ హావ్ ఎ లుక్..
కథ:
రవి (సంతోష్) పేపర్ బాయ్. తెల్లారుజామునే లేచి ఇంటింటికి పేపర్లు వేసుకుని బి.టెక్ చదువుకుంటాడు. పాత తెలుగు పుస్తకాలను చదవడం అతని అలవాటు. చదివిన వాక్యాలు నచ్చినప్పుడు వాటిని అండర్‌లైన్ చేయడం కూడా అతనికి ఇష్టం. సరిగా అతని అభిప్రాయాలకు సరిపోయే అలవాట్లే ధనవంతురాలి బిడ్డ ధరణి (రియా)కు ఉంటుంది. ఆమె ఇంటి చుట్టూ తిరిగి, చివరికి ఆమె ప్రేమను సంపాదించగలుగుతాడు రవి. ఆమెతో పాటు ధరణి తల్లిదండ్రులు కూడా వారి ప్రేమను అంగీకరిస్తారు. కానీ ఆమె సోదరులు తేనెపూసిన కత్తుల్లా వ్యవహరిస్తారు. దాని పర్యవసానంగా వారి ప్రేమ విడిపోతుంది. రవి చనిపోయాడనుకుంంటుంది ధరణి. కానీ ఓ చిన్న సంఘటన వల్ల అతను బతికే ఉన్నాడని తెలుసుకుంటుంది. మరి ఉన్న ఊరు విడిచిపెట్టి వెళ్లిన రవిని ధరణి ఎలా కలుసుకుంది? నిజాయతీ ఉన్న వారి ప్రేమను కలపడానికి ప్రకృతి ఎలా సహకరించింది అనేది సస్పెన్స్.
ప్లస్ పాయింట్లు:
పేపర్ బాయ్ అనే టైటిలే కొత్తగా ఉంది. ప్రతిరోజూ కొన్ని వందల వార్తలను మోసుకొచ్చే పేపర్ బాయ్‌ల జీవితాలను తెరమీద చూపించాలనే ప్రయత్నం మంచిదే. ఇందులో పేపర్‌బాయ్ వ్యక్తిత్వాన్ని శ్రమను గురించి చెప్పే పాట కూడా ఆకట్టుకుంటుంది. చంద్రబోస్ ఆ పాటను పాడారు. కెమెరా పనితనం బావుంది. ఒకే మొక్కకు రంగు రంగుల పువ్వులు పూయడం బావుంది. కొన్ని లొకేషన్లను చూస్తే.. ఒక్కసారైనా వెళ్లి వస్తే బావుంటుందనిపిస్తుంది. అక్కడక్కడా డైలాగులు మెప్పిస్తాయి. పాటలు బావున్నాయి. ఆర్ట్ పనితనం కూడా మెప్పిస్తుంది.
మైనస్ పాయింట్లు:
ఇప్పట్లో లైబ్రరీలు సిటీల్లో పెద్దగా తారసపడవు. ఉన్నా.. అక్కడ పుస్తకాలు తెచ్చుకుని చదువుకుని, అండర్‌లైన్ చేసుకుని.. ఇవి నేటి యూత్‌కు పెద్దగా ఎక్కే అంశాలు కావు. పేద, ధనికుల మధ్య ప్రేమ పుట్టడం కూడా చాలా పాత కథ. తల్లిదండ్రులు ఒప్పుకున్నా, పరువు కోసం అన్నయ్యలు కాదనడం కూడా పాత కథే. సన్నివేశాలు ఆసక్తికరంగా నడవవు. వృథా సీన్లు చాలా ఉన్నాయి. కథ చాలా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని పాత్రలు చాలా కృతకంగా అనిపిస్తాయి.
సమీక్ష:
హీరో ఫ్రెండ్ తన లవర్‌కి ప్రపోజ్ చేస్తే, ఆమె ఆ లెటర్‌లో తొక్కలు చుట్టి నడి రోడ్డున పడేస్తుంది.. ఇది సైరాట్ సీన్. మా నాన్న ఫలానా.. అని చెప్పి పుష్టిగా తిని బండరాయిలా తినే అమ్మాయిలు చాలా మందే.. మన చాలా తెలుగు సినిమాల్లో స్క్రీన్‌ప్లే ఆద్యంతం గుర్తు చేసే సినిమా ... శివమణి అలెప్పీ సన్నివేశాలు చూడగానే గుర్తొచ్చే సినిమా... ఏ మాయ చేసావె! డైరీల్లో ఉన్న పేపర్లు చింపడం, అది ఇంకొకరికి దొరకడం... ఇవన్నీ కూడా మన పాత సినిమాల్లోని సన్నివేశాలే.. వెరసి `పేపర్‌బాయ్` కొత్త కథను, కొత్త సన్నివేశాలను, కొత్త ఫీలింగ్‌ను మాత్రం మోసుకురాలేకపోయాడు. కాకపోతే ఆపరేషన్ సక్సెస్ అయింది.. పేషెంట్ ఫెయిల్ అన్నట్టు.. ఈ సినిమా ప్రేక్షకుల్లోకి ఎంత వెళ్తుందో తెలియదు కానీ, హీరో వాగ్దాటి, ఈజ్ మాత్రం గుర్తుండిపోతుంది. హీరోకి మంచి ఫ్యూచర్ ఉంది.
బాటమ్ లైన్: కొత్త పస లేని 'పేపర్ బాయ్'
Read Paper Boy Review in English
- Read in English