చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నహీరో గోపీచంద్‌కి కెరీర్‌లో హిట్స్ అందించిన దర్శకుల్లో ఎక్కువ మంది డెబ్యూ డెరెక్టర్స్ కావడం విశేషం. అందుకే ప్రెస్టీజియస్‌గా భావించిన తన 25వ సినిమాను కె.చక్రవర్తి అనే కొత్త దర్శకుడితో చేయడం గమనార్హం. ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాన్సెప్ట్‌తో రూపొందిన గోపీచంద్ 25వ చిత్రం `పంతం`లో డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. మన చుట్టూ జరుగుతున్న సమస్య.. ఎవరూ పట్టించుకోని సమస్యను మా సినిమాలో చూపించబోతున్నామని యూనిట్ సభ్యులు అన్నమాటలతో..అసలు గోపీచంద్ తన సినిమాలో ఎలాంటి కాన్సెప్ట్‌ను టచ్ చేయబోతున్నాడనే ఆసక్తి కలిగింది. అసలు గోపీచంద్ `పంతం` చిత్రంలో టచ్ చేసిన అంశమేంటి? చాలా కాలంగా గోపీచంద్‌తో దోబుచులాడుతున్న హిట్‌ను `పంతం` అందించిందా? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
హోం మినిష్టర్ జయేంద్ర(సంపత్) అందరినీ మోసం చేస్తూ.. ప్రజలను ఇబ్బంది పెడుతూ నల్లధనం వెనకేస్తాడు. తను బ్లాక్ మనీని తరలిస్తున్న ప్రతి సందర్భంలో హీరో (గోపీచంద్), అతని స్నేహితుడు(శ్రీనివాసరెడ్డి) ఆ డబ్బును కొల్లగొడుతుంటారు. ఆ డబ్బును దుర్గాదేవి చారిట్రబుల్ ట్రస్ట్‌కు తరలిస్తుంటారు.అసలు తన డబ్బును ఎవరు దొంగలిస్తున్నారో తెలియక జయేంద్ర తల పట్టుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో తన తెలివి తేటలతో అసలు దొంగ గోపీచంద్ అని తెలుసుకుంటాడు. అయితే గోపీచంద్ గురించి అసలు నిజం తెలుస్తుంది. అసలు గోపీచంద్ హోం మినిష్టర్‌ని ఎందుకు టార్గెట్ చేస్తాడు? దొంగిలించిన డబ్బును ఏం చేస్తుంటారు? విక్రాంత్ సురానా ఎవరు? దొంగకు, విక్రాంత్ సురానాకు ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
సినిమాలో గ్రాండియర్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్‌ను కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల అద్భుతంగా తెరపై ఆవిష్కరింపచేశారు. అలాగే మేకింగ్‌లో నిర్మాత టేస్ట్ కూడా బావుంది. ఇక గోపీచంద్ విషయానికి వస్తే.. తను రెండు షేడ్స్ ఉన్న పాత్రను చక్కటి వేరియేషన్స్‌తో చక్కగా నటించాడు. లుక్స్ పరంగా కూడా గోపీచంద్ చూడటానికి బావున్నాడు. సినిమాలో నేపథ్య సంగీతం బావుంది. అలాగే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరించిన తీరు బావుంది. క్లైమాక్స్ కోర్టు సీన్ ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్:
హీరో రాబిన్ హుడ్‌లా మారి విలన్స్ దగ్గర డబ్బులు కొట్టేసే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి బ్యాక్‌డ్రాప్‌తోనే దర్శకుడు సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేదు. శ్రీనివాసరెడ్డి, పృథ్వీల కొద్దిపాటి కామెడీ మినహా సినిమాలో కామెడీ కనపడదు. గోపీసుందర్ సంగీతం అందించిన పాటలు మెచ్చుకోలుగా లేవు. అంతే కాకుండా పాటలు వచ్చే సందర్భాలు కూడా సినిమా ఫ్లోకు బ్రేక్ వేసేలా అనిపిస్తుంది.
సమీక్ష:
గోపీచంద్ 25వ సినిమా.. ఎలా ఉంటుందో అనే సస్పెన్స్‌కు ఈ రోజు తెరపడింది. ఏదో మెసేజ్ మూవీ అన్నారు కాదు.. ఏదైనా కొత్తదనంతో సినిమా ఉంటుందా? అని ఎదురుచూసిన ప్రేక్షకుడికి నిరాశ మిగిలింది. ఎందుకంటే చాలా సినిమాల్లో హీరో రాబిన్ హుడ్‌లా మారి దొంగతనం చేయడం ముందు విలన్స్ ఆ పని చేసిందెవరలో తెలియకపోవడ.. తెలుసుకునే లోపు హీరో విలన్స్ భరతం పట్టడం ఈ కాన్సెప్ట్‌తోనే పంతం సినిమా సాగింది. హీరో చేసే పని వెనుక ఓ సోషల్ కాస్‌ను కారణంగా చూపించిన తీరు బావుంది. సినిమా అంతా కాస్త రొటీన్‌గా అనిపించినా చివరలో వచ్చే క్లైమాక్స్ సీన్ ఆకట్టుకుంటుంది. ఆ సన్నివేశంలో డైలాగ్స్, వాటిని గోపీచంద్ పలికిన తీరు.. రాజకీయ నాయకులు, వారికి ఓట్లేసి గెలిపించే ప్రజలను కూడా విమర్శించిన విధానం బావుంది. లంచం తీసుకుని ఓటేయడమే మన సమస్యలకు కారణమని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. అయితే గోపీచంద్ 25వ సినిమా మరింత ఎక్స్‌పెరిమెంటల్.. మరేదైనా కొత్త కథనంతో చేసుంటే బావుండేదనిపించింది. హీరో హీరోయిన్‌ను చూడటం ప్రేమలో పడటం.. ఆమెకు వేరొకరితో పెళ్లి అవుతుండటం.. అది చూసిన హీరో బాధపడటం.. హీరోయిన్ తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పద్దతి నచ్చక పెళ్లిమానుకోవడం.. చివరకు హీరో ఓ చిన్న అమ్మాయికి సహాయం చేయడం చూసి అతనితో ప్రేమలో పడటం పాటలు.. ఇదే రొటీన్ లవ్ స్టోరీ.. అలాగే హీరో, హీరో స్నేహితుడు పృథ్వీలాంటి వ్యక్తి ఇంట్లో చేరి కొన్ని పనులు చేయడం అతన్ని తెలివిగా వాడుకోవడం.. ఇది కూడా రొటీన్ కామెడీ.. హీరో హీరోయిన్‌తో మధ్య మధ్యలో పాటేసుకోవడం..ఇవన్నీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో జరిగే తంతే.. కొత్తగా చూసేం కథ ఉండదు.
బోటమ్ లైన్: సినిమాలో కొత్తదనం కోసం పంతం చూపించి ఉంటే బావుండేది.
Comments