T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. పంత్ ఇన్.. రాహుల్ ఔట్..

  • IndiaGlitz, [Tuesday,April 30 2024]

అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2024) కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను నియమించింది. ఇక ఐపీఎల్‌లో అదరగొడుతున్న రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్‌ దూబె, యుజ్వేంద్ర చాహల్‌లకు సెలెక్టర్లు జట్టులో అవకాశం కల్పించారు. అలాగే శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు.

దీంతో యాక్సిడెంట్ కారణంగా కొంతకాలంగా భారత జట్టుకు దూరమైన రిషబ్ పంత్.. తిరిగి కోలుకుని ఐపీఎల్‌లో రాణిస్తున్నాడు. దీంతో సెలెక్టర్లు పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా, ఆటగాడిగా సంజూ శాంసన్ కూడా రాణిస్తుండటంతో అవకాశం కల్పించారు. మరోవైపు సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు మాత్రం నిరాశ తప్పలేదు. శుభ్‌మన్‌ గిల్, రింకూ సింగ్‌లకు ప్రధాన జట్టులోనే చోటు దక్కుతుందని భావించినప్పటికీ రిజర్వ్ ప్లేయర్లుగానే సెలెకర్లు పరిగణనలోకి తీసుకున్నారు.

క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 1 నుంచి ప్రారంభమై.. జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. అమెరికాలో 3, వెస్టిండీస్‌లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌-ఏ లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఉన్నాయి. జూన్‌ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక 9న దాయాది పాకిస్థాన్‌తో, 12న అమెరికాతో, 15న కెనడాతో తలపడనుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌