అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును ప్రకటించిన పన్నీర్ సెల్వం

  • IndiaGlitz, [Wednesday,October 07 2020]

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును అధికారికంగా ప్రకటించారు. నిన్న మొన్నటి వరకూ ఉన్న విభేదాలన్నింటినీ పక్కనపెట్టి పళని స్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వమే ప్రకటించడం విశేషం. పన్నీర్ సెల్వంకు పార్టీ పెద్దలు ముందుగా మాటినట్టుగానే 11మందితో కూడిన స్టీరింగ్ కమిటీ ఏర్పాటును సైతం ఇవాళ ప్రకటించారు. స్టీరింగ్ కమిటీ కోఆర్డినేటర్‌గా పన్నీర్‌సెల్వం ఉండనున్నారు. అన్నాడీఎంకే చీఫ్‌ను 11మందితో కూడిన ఈ కమిటీయే నిర్ణయించనుంది.

కాగా.. గత నెల 28న అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వివాదం చెలరేగింది. పార్టీ ముఖ్య నేతలైన పళనిస్వామి, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం వాగ్వాదానికి దిగడంతో పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు అవాక్కయ్యారు. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం కాస్త పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి.. పన్నీర్ సెల్వంతో పలు విడతలుగా చర్చలు జరిపి ఆయనను శాంతింపజేసేందుకు యత్నించారు. అనంతరం పన్నీర్ సెల్వం తన స్వస్థలమైన పెరియకులంలోని కైలాసపట్టి ఫామ్‌హౌస్‌లో తన మద్దతుదారులతో పలు విడతలుగా మంతనాలు జరిపారు. అనంతరం గత ఆదివారం చెన్నైకు తిరిగి వచ్చారు.

చెన్నైకు రాగానే పార్టీ సీనియర్లతో పన్నీర్ సెల్వం చర్చలు జరిపారు. పార్టీ భవిష్యత్ కోసం సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో పట్టు సడలించాలని పన్నీర్ సెల్వంను పార్టీ నేతలు కోరారు. దీనికి ప్రతిగా పన్నీర్‌సెల్వం కోరుతున్నట్లు 11 మందితో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేయిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. బుధవారం సీఎం అభ్యర్థిని ప్రకటించిన సమయంలోనే మార్గదర్శక కమిటీ ఏర్పాటు గురించి కూడా ప్రకటన చేయాలని పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. అందుకు పార్టీ నేతలు అంగీకరించడంతో పన్నీర్ సెల్వం దిగి వచ్చారు. దీంతో నేడు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంతో పాటు స్టీరింగ్ కమిటీని సైతం పార్టీ అధికారికంగా ప్రకటించింది.