Download App

Pandem Kodi 2 Review

సంక్రాంతి అంటే పందెంకోడి అంటే గుర్తుకు వ‌స్తుంది. కానీ సినీ అభిమానుల‌కు `పందెంకోడి` అంటే గుర్తుకు వ‌చ్చేది హీరో విశాల్‌. ఆ సినిమా ఎఫెక్ట్ అంత‌లా ఉంది. విశాల్ సినిమా కెరీర్‌కే చాలా పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ అది. ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత ఆ సినిమాకు సీక్వెల్ పందెంకోడి 2 విడుద‌ల‌వుతుందంటే ఎన్ని అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విశాల్ 25వ సినిమాగా రూపొందిన `పందెంకోడి 2` ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైంది. మ‌రి పార్ట్ వ‌న్‌ను ఈ సీక్వెల్ భారీ అంచ‌నాల న‌డుమ రీచ్ అవుతుందో కాదో.. తెలుసుకోవాలంటే అస‌లు సినిమా క‌థేంటో చూద్దాం..

క‌థ‌:

రాజారెడ్డి(రాజ్‌కిర‌ణ్‌) స‌హా ఏడు గ్రామాల ప్ర‌జ‌లు కుల‌దైవంగా వీర‌భ‌ద్రుడిని కొలుస్తుంటారు. ఓసారి జాత‌ర‌ సంద‌ర్భంలో ఈ ఏడు గ్రామాల్లో రెండు గ్రామాల్లో వ్య‌క్తుల‌కు పెద్ద గొడ‌వ‌లు అవుతాయి. ఆ గొడ‌వ‌ల్లో భ‌వాని( వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) భ‌ర్త‌ను చంపేస్తారు. అందుకు ప్ర‌తిగా భ‌వాని మ‌నుషులు కూడా ప్ర‌త్యర్థి వ‌ర్గానికి చెందిన వాళ్లంద‌రినీ చంపేస్తారు. వారిలో ఓ కుర్రాడు మాత్రం మిగిలిపోతాడు. జాత‌ర‌ను ఏడేళ్లుగా జర‌పుకోరు. అన్ని ఊళ్ల జ‌నాల కోసం రాజారెడ్డి మ‌ళ్లీ జాత‌ర‌ను చేయాల‌నుకుంటాడు. అదే స‌మ‌యంలో భ‌వాని మ‌నుషులు ఆ కుర్రాడిని చేంపేయాల‌నుకుంటారు. రాజారెడ్డి ఆ కుర్రాడిని కాపాడతాన‌ని మాటిస్తాడు. అదే స‌మ‌యంలో ఏడేళ్లుగా విదేశాల్లో ఉంటున్న రాజారెడ్డి కొడుకు బాలు(విశాల్‌) ఊరికొస్తాడు. అక్క‌డ చారుల‌త‌(కీర్తిసురేశ్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఏడు రోజుల పాటు జ‌రిగే జాత‌ర్లో భ‌వానీ మ‌నుషుల నుండి రాజారెడ్డి, బాలు ఆ కుర్రాడిని ఎలా కాపాడార‌నేదే సినిమా.. అది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

న‌టీన‌టులు ప‌నితీరు:

పందెంకోడి విశాల్‌కు హీరోగా చాలా పెద్ద బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత పందెంకోడి 2లో విశాల్ లుక్‌లో ఎలాంటి మార్పూ లేదు. అంతే ఎన‌ర్జిటిక్‌గా వ‌ర్క్ చేశారు. ఇక యాక్ష‌న్ సీన్స్‌లో విశాల్ పెర్‌పార్మెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కీర్తిసురేశ్ త‌న న‌ట‌న‌తో మ‌రోసారి ఆక‌ట్టుకుంది.  అల్ల‌రి పిల్ల‌గా విశాల్‌తో ఆమె చేసిన కామెడీ..అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంఇ. ఇక రాజ్‌కిర‌ణ్ పాత్ర ఎప్ప‌టిలాగానే హుందాగా సాగింది. ఇక విల‌న్‌గా న‌టించిన వ‌ర‌ల‌క్ష్మి త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విశాల్‌తో చేసే ఫైట్ సీన్స్ ..అందులో ఆమె న‌ట‌న అల‌రించింది. హ‌రీష్ పేరాడే, గంజా క‌రుప్పు, రాందాస్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

టెక్నీషియ‌న్స్ ప‌నితీరు:

పందెంకోడి పార్ట్ వ‌న్‌ని కాస్త సిటీలో.. మ‌రి కాస్త ప‌ల్లెటూరిలో తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు లింగుస్వామి పార్ట్‌ను మాత్రం విలేజ్‌లోనే తెర‌కెక్కించాడు. ఓ భారీ సెట్ వేసి అందులో చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేశాడు. క‌థ విష‌యంలో వ‌స్తే అక్క‌డ‌క్క‌డా లాజిక్స్ మిస్ అయ్యాయి. అయితే ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇచ్చే పాత్ర‌ల్లో రాజ్ కిర‌ణ్‌, విశాల్‌ను ద‌ర్శ‌కుడు లింగుస్వామి చ‌క్క‌గా చూపించాడు. తండ్రిని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో విశాల్ ఎలాంటి ప‌నులు చేస్తాడు. అదే స‌మ‌యంతో తండ్రి ఇచ్చిన మాట కోసం విల‌న్స్ బారి నుండి త‌న‌కు కావాల్సిన కుర్రాడిని ఎలా కాపాడుకుంటాడ‌నేది యాక్ష‌న్ పార్ట్‌తో ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు. సినిమాలో క్లైమాక్స్‌లో వ‌చ్చే పిచ్చోడు .. అత‌ని స‌న్నివేశాల‌కు క్లారిటీ లేదు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన పాట‌ల్లో రెండు పాట‌లు బావున్నాయి. నేప‌థ్య సంగీతం బావుంది. శ‌క్తివేల్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. తెలుగులో డైలాగ్స్ బాగున్నాయి.

విశ్లేష‌ణ‌:

సినిమా స్టార్ట‌యిన 20 నిమిషాల్లోనే క‌థేంట‌నే దానిపై ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. అయితే దాన్ని ద‌ర్శ‌కుడు న‌డిపిన తీరు ఆస‌క్తిక‌రంగా అనిపించింది. హీరో చేసే జాత‌ర పైట్‌.. ఎమోష‌న‌ల్‌గా సాగే ఇంట‌ర్వెల్ ఫైట్‌.. ఇక క్లైమాక్స్‌లో విశాల్‌, వ‌ర‌ల‌క్ష్మి మ‌ధ్య జ‌రిగే ఫైట్ ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయ‌న‌డంలో సందేహం లేదు.

చివ‌ర‌గా..  పందెంకోడి 2... స్పీడు త‌గ్గ‌లేదు

Read 'Pandem Kodi 2' Movie Review in English

Rating : 2.8 / 5.0