Panchkarla Ramesh Babu:జనసేనలోకి పంచకర్ల .. ముహూర్తం ఖరారు, పెందుర్తిలో పోటీపై రమేష్ బాబు స్పందన ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు చేరేది మాత్రం ఆయన వెల్లడించలేదు. దీనిపై పంచకర్ల క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. విశాఖ నుంచి 400 కార్లు, 25 బస్సులతో మంగళగిరికి వెళ్లనున్నట్లు చెప్పారు. వైసీపీలో వున్నప్పుడు బాగానే పనిచేశానని.. ఏ పార్టీలో లేనప్పుడు పెందుర్తి నుంచే పోటీ చేస్తాను అన్నానని అది తన వ్యక్తిగతమని పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఇకపై తమ అధినేత పవన్ ఆదేశాల మేరకు పనిచేస్తానని ఆయన తెలిపారు.
వైసీపీలో వున్నప్పుడు ఏ ఆర్ధిక ప్రయోజనం పొందలేదు :
వైసీపీలో పనిచేసిన సమయంలో ఎలాంటి ఆర్ధిక లబ్ధి పొందలేదన్నారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని పంచకర్ల రమేష్ బాబు సవాల్ విసిరారు. వైవీ సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. వైసీపీలో వున్నప్పుడు పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయమని ఒత్తిడి వచ్చినా తాను చేయలేదని ఆయన తెలిపారు. జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు చిరంజీవి కుటుంబంతో కానీ మరోకరితో గాని మాట్లాడలేదని పంచకర్ల రమేష్ బాబు వెల్లడించారు. వైసీపీలో తనకు గౌరవం లేకపోవడం వల్లే బయటకు వచ్చానని ఆయన స్పష్టం చేశారు.
తిరుపతి టికెట్లు ఇప్పించడం తప్పించి ఏం చేయలేకపోయా :
పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తను వైసీపీ గుర్తించలేదని పంచకర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయమే వైసీపీ అధినాయకత్వానికి చెప్పానని పేర్కొన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానని రమేష్ బాబు వెల్లడించారు. జనసేనలో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని ఆయన బాంబు పేల్చారు. తిరుపతి దర్శనం టికెట్లు ఇప్పించడం తప్ప వైసీపీలో ఎవరికీ ఏమీ చేయలేకపోయానని పంచకర్ల రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments