ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు.. కొత్త జిల్లాలకు బ్రేక్..
- IndiaGlitz, [Wednesday,November 18 2020]
ఏపీలో కరోనా కారణంగా ఆగిపోయిన పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతోంది. ఈ ఎన్నికలు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పక్షాలతో చర్చించి ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే న్యాయపరమైన ఇబ్బందులన్నీ తొలిగిపోయాయన్నారు. ఈ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో కరోనా ఉధృతితో పాటు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నిమ్మగడ్డ తెలిపారు.
కాగా.. రాష్ట ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే కరోనా కేసులు కాస్త కంట్రోల్లోకి వచ్చాయని నిమ్మగడ్డ తెలిపారు. ఈ విషయమై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అలాగే తెలంగాణలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయని నిమ్మగడ్డ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగపరమైన అవసరమన్నారు. ప్రస్తుతానికి ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో లేదని.. ఎన్నికలకు నాలుగు వారాల ముందు మాత్రమే కోడ్ అమలులోకి వస్తుందన్నారు.
ప్రభుత్వంతో పాటు ఇతర రాజకీయ పక్షాలు, అధికారులు ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు. ప్రస్తుతం జరగబోయే పంచాయితీ ఎన్నికలు రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా.. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు తీసుకునేందుకు కూడా దోహదపడతాయన్నారు. ఈ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో.. నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.
కాగా.. స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పక్కనబెట్టాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఆయన సీఎస్‌కు లేఖ రాశారు. పాత జిల్లాల ప్రాతిపదికన ఎన్నికల ప్రక్రియ చేపట్టామని.. అందువల్ల ఎన్నికలు పూర్తయ్యే వరకూ రాష్ట్రంలో 13 జిల్లాలే ఉండాలని ఆయనా లేఖలో పేర్కొన్నారు. జిల్లాల సంఖ్య పెంచడం వల్ల జడ్పీ ఎన్నికల నిర్వహణకు సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని ఆ లేఖలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.