Panchakarla Ramesh Babu:పవన్ కల్యాణ్‌తో పంచకర్ల రమేశ్ భేటీ .. ఈ నెల 20న జనసేనలోకి , ఉత్తరాంధ్రలో ‘‘గ్లాస్’’కు జోష్
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేశ్ బాబు జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో అనుచరులతో పాటు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం రమేశ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 20న పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు వెల్లడించారు. అధినేత ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని రమేశ్ బాబు పేర్కొన్నారు.
అధ్యక్షుడినైనా స్వేచ్ఛ లేదు :
ఇదే సమయంలో వైసీపీ అధినేత , సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పంచకర్ల తీవ్ర విమర్శలు చేశారు. క్లిష్టపరిస్ధితుల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు ఏడాదిగా ప్రయత్నిస్తున్నా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో తన చేతగానితనాన్ని క్షమించాలని కార్యకర్తలను రమేశ్ బాబు కోరారు. పార్టీలో జరుగుతున్న విషయాలు జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా అవకాశం దొరకలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పినా.. పార్టీ నేతలు కనీసం పట్టించుకోలేదని పంచకర్ల రమేశ్ బాబు దుయ్యబట్టారు. పేరుకి అధ్యక్షుడినైనా తనకు ఎలాంటి స్వేచ్ఛ లేదని.. ఏం చేయలేనప్పుడు అధ్యక్ష పదవిలో వుండలేకనే రాజీనామా చేశానని పంచకర్ల స్పష్టం చేశారు.
పెందుర్తి టికెట్ రేసులో పంచకర్ల :
కాగా.. పెందుర్తి నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. ఇటీవల పెందుర్తిలో జరిగిన పరిణామాలతో రమేశ్ బాబు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వైసీపీలో వుంటే టికెట్ దక్కుతుందో లేదోనన్న అనుమానాల నేపథ్యంలో పంచకర్ల అధికార పార్టీని వీడినట్లుగా ఉత్తరాంధ్రలో జోరుగా చర్చ నడుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments