Paisa Vasool Review
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 101వ చిత్రం `పైసావసూల్`. `ఇది నా తొలి సినిమా లాంటిది. ఫ్రెష్ ఇన్నింగ్స్ ఈ సినిమాతో మొదలుపెడుతున్నా` అని పూరి స్వయంగా చెప్పిన సినిమా `పైసా వసూల్`. అభిమానులను అలరించే డైలాగులతో ఇప్పటికే ట్రైలర్ అందరినీ మెప్పించింది. ఇన్నేళ్ల కెరీర్‌లో పూరి జగన్నాథ్ తొలిసారి నందమూరి బాలకృష్ణతో సినిమా చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో బాలకృష్ణ `తేడాసింగ్`గా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? ప‌్రేక్షకులను అలరించిందా? లేదా? చదివేయండి.. .
కథ:
తేడాసింగ్ (బాలకృష్ణ) తనకు నచ్చినట్టు ఉంటాడు. నచ్చిన వారిని కాపాడుతుంటాడు. అతని ప్రవర్తనను గమనించిన పోలీస్ ఆఫీసర్ (కైరాదత్) అతన్ని ఓ స్ట్రింగ్ ఆపరేషన్‌లోకి లాగాలని అనుకుంటుంది. తీహార్ జైల్ నుంచి విడుదలైనట్టు తేడాసింగ్ చెబుతాడు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో అతను ఫారిన్ నుంచి వచ్చినట్టు తేలుతుంది. ఇంతలో తన అక్క సారిక (శ్రియ)ను చంపిన వ్యక్తి అనుకుని హారిక (ముస్కాన్) తేడాసింగ్‌ను కాల్చేస్తుంది. ఇంతకీ తేడాసింగ్ గతమేంటి? అతనికి సారికతో ఎందుకు పరిచయమైంది. రా ఏజెంట్ బాలకృష్ణ నందమూరికి, తేడాసింగ్‌కు ఉన్న సంబంధం ఏంటి? సారిక ఇన్వెస్టిగేషన్ చేసిన బాబ్‌మార్లే (విక్రమ్ జీత్) ఎవరు? అతన్ని బాలా ఎందుకు చంపాడు? లాయర్ (పృథ్వి) ఇంట్లో జరిగిన న్యూసెన్స్ ఏంటి? వంటివన్నీ ఆసక్తికరం.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు ఆద్యంతం నందమూరి బాలకృష్ణ ప్లస్ పాయింట్. చలాకీగా, దుడుకుగా, కొత్తగా అతను చేసిన యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్సులు, నటన, కార్ ఛేజింగ్‌లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ట్రైలర్‌లో మొదటి నుంచీ హల్ చల్ చేస్తున్న తేడా సింగ్ డైలాగులు, బీహార్‌లో తాగించిన వాడిని తీహార్ లో పోయించా, జంగిల్‌బుక్‌లో పులి.. డైలాగులకు థియేటర్లో విపరీతమైన స్పందన వస్తోంది. నన్ను తాకాలంటే అది ఫ్యామిలీ అయినా అయి ఉండాలి.. లేదా అభిమానులైనా అయి ఉండాలనే డైలాగు సినిమాలో రెండు సార్లు రిపీట్ అవుతుంది. తొలిసగం ఎక్కువగా ఈ సినిమా కోసం వేసిన సెట్లోనే కథ జరుగుతుంది.సెకండాఫ్లో కనిపించే పోర్చుగల్ లొకేషన్స్ కొత్తగా అనిపించాయి. డ్యాన్సుల కంపోజింగ్, ఫైట్ల కంపోజింగ్‌లో కొత్తదనం కనిపించింది.
మైనస్‌లు:
తొలిసగంలో పృథ్వి కామెడీ పెద్దగా పండలేదు. అలాగే సెకండాఫ్‌లో అలీ పాత్ర ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. మామూలుగా పూరి-అలీ కాంబినేషన్‌లో ఏదో ఒక కొత్త కామెడీని ఆస్వాదించే ప్రేక్షకులను `పైసా వసూల్` నిరాశపరచినట్టే. సారిక చనిపోయిన విషయం ముందే తెలిసిపోవడంతో కథ సెకండాఫ్ లో ఆసక్తికరంగా అనిపించదు. ఆద్యంతం `పోకిరి` చిత్రాన్ని గుర్తుచేస్తుంది. హీరో కేరక్టరైజేషన్, అతని బిహేవియర్ పూరి మిగిలిన సినిమాల హీరోలను జ్ఞప్తికి తెస్తూనే ఉంటుంది. ఫైట్లు, పూరి మార్కు డైలాగులు, బాలకృష్ణ కొత్త తరహా నటనను పక్కనపెడితే సినిమాలో మిగిలేదేమీ ఉండదు. పూరి పాత సినిమాల్లో హీరో బాడీ లాంగ్వేజ్‌ను బాలయ్యకు ఆపాదించాడు. డైలాగ్స్ పై శ్రద్ధ కనపరిచిన పూరి కథ విషయంలో కూడా పెద్దగా కష్టపడలేదు. తన పాత కథ పోకిరిని అటు, ఇటు మార్చి రాసేసుకున్నాడు. పోకిరిలో మహేష్ అండర్ కవర్ పోలీస్ అయితే ఇందులో బాలయ్య అండర్ కవర్ రా ఏజెంట్. ఇక అనూప్ సంగీతం సరేసరి. పాటల్లో హోరెక్కువైంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగతి సరేసరి. ఇక సినిమాలో కామెడి అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. సాధారణంగా పూరి సినిమాల్లో అలీ కామెడి బావుంటుంది. కానీ సినిమాలో అలీ పాత్ర ఏమీ లేదు. తేలిపోయింది. అలీ పాత్ర ఉండాలి కాబట్టి ఉన్నట్టు అనిపిస్తుంది. పృథ్వీ కామెడి కూడా సో సోగానే ఉంది
విశ్లేషణ:
పూరి సినిమాలో హీరో మాస్ యాంగిల్‌లో డిఫరెంట్ మేనరిజమ్‌తో ఉంటాడు. ఇప్పటి వరకు ప్రేక్షకులు పూరి హీరోను అలాగే చూశారు. ఇలాంటి దర్శకుడు బాలయ్యతో సినిమా చేస్తానడంతో అసలు బాలకృష్ణను పూరి తెరపై ఎలా చూపిస్తాడోనని అందరిలో ఆసక్తి మొదలైంది. పూరి తన మార్కు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఉన్న హీరో బాలయ్యను వెండితెరపై ఆవిష్కరించాడని స్టంపర్, ట్రైలర్ చూసినవారికి అర్థమైంది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు బాలకృష్ణ చేసిన సినిమాలు ఓ ఎత్తు అయితే, పైసా వసూల్ మరో ఎత్తు. ఈ సినిమాలో బాలయ్య ఎనర్జీ పీక్స్ అనుకోవాలి. ఓ సీనియర్ హీరోను ఇంత డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయడం పూరికే చెల్లింది. శ్రియ, ముస్కాన్, కైరాదత్‌లు గ్లామర్, పాటలకు పరిమితం అయ్యారు. హీరోయిన్లు వారి వారి పరిధుల్లో బాగానే నటించారు. నన్ను ఇక్కడ కాల్చాలంటే నా అభిమానులైనా అయ్యి ఉండాలి, నా బంధువులైనా అయి ఉండాలి, బీహార్‌లో తాగించినవాడిని తీహార్‌లో పోయించా తూ క్యారే అవులే,సింహానికి మేక ఎరేయాలనుకోవడం కరక్టే కానీ ఆ ప్లాన్ని మేకలన్నీ కలిపి చేయకూడదు. ఫాలోయింగ్ ఉన్నవాణ్నే కానీ, ఫాలో అయ్యేవాణ్ని కాను, పదిమందికి పెట్టాలన్నా నేనే, నలుగురు పెట్టాలన్నా నేనే...అనే డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అలాగే అలాగే బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్లు పూరి చాలా డైలాగ్స్‌ను రాశారు. . బాలకృష్ణ వ్యావహారిక శైలి చాలా వరకు `పోకిరి` చిత్రాన్ని, పూరి గత చిత్రాలను గుర్తుచేస్తాయి. కెమెరాపరంగా, ఎడిటింగ్ పరంగా సినిమా బాగా ఉంది. సినిమా చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు కనపడవు. రీరికార్డింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఉంటే బావుండేదేమో. మినిస్టర్‌గా నటించిన కృష్ణస్వామి శ్రీకాంత్ ముఖంలో భావోద్వేగాలు సరిగా పలకలేదు. కథలోనూ చెప్పుకోదగ్గంత కొత్తదనం ఏమీ లేదు. క్లైమాక్స్ లో బాలకృష్ణ దేశం గురించి, దేశభక్తి గురించి మాట్లాడిన తీరు మెప్పిస్తుంది. పక్కా మాస్ మూవీ. బాలకృష్ణ ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో చెప్పినట్లు ఈ చిత్రం ఫ్యాన్స్, ఫ్యామిలీల కోసమే..నాట్ ఫర్ అదర్స్.
బోటమ్ లైన్: పైసా వసూల్... పూరి మార్కు బాలయ్య చిత్రం
Paisa Vasool Movie Review in English
- Read in English