Padmavat Review
చరిత్రను సినిమాగా తెరకెక్కించడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎంతో అవగాహన అవసరం. అనుభవంతో కూడిన సృజన కూడా ఉంటేనే తెరపై దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని చూపించగలడు. సంజయ్ లీలా భన్సాలీకి ఇలాంటి సృజన మెండుగా ఉంది కాబట్టే ఆయన సినిమాలు లార్జర్ దేన్ లైఫ్‌లా ఉంటాయి. ప్రతి సీన్‌ను దర్శకుడు సంజయ్ శిల్పంలా చెక్కుతాడు. గతంలో జోథా అక్బర్, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలను తెరకెక్కించిన అనుభవంతో సంజయ్ మరోసారి మరో హిస్టారికల్ మూవీని ప్రేక్షకులకు చూపించడానికి పూనుకున్నాడు. ఆ చిత్రమే `పద్మావత్`. కాలగమనంలో కలిసిపోయిన ఓ రాజపుత్ర వీర వనిత ఆత్మ త్యాగమే ఈ చిత్రం. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాపై వివాదాలు కూడా అమితమే. యూనిట్‌పై దాడులు కూడా జరిగాయి. సినిమా విడుదలకు పలు రాజపుత్ర సంఘాల నుండి, రాజకీయ నాయకుల నుండి వ్యతిరేకత వచ్చింది. ఈ వివాదాలకు చెక్ చెప్పడానికి సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టు రంగంలోకి దిగిందంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని వివాదాల నడుమ విడుదలైన పద్మావత్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అని తెలుసుకుందాం...
కథ:
గెలుపు అంటే ఎలాగైనా గెలవాలి.. మోసం చేసైనా.. ఎదుటివాడిని చంపి అయినా తను అనకున్నది సాధించాలనుకునే వ్యక్తి అల్లావుద్ధీన్ ఖిల్జీ(రణవీర్ సింగ్). కామాంధుడైన అల్లావుద్ధీన్ కన్ను ఖిల్జీ రాజ్యాధినేత జలాలుద్ధీన్ కుమార్తె మెహరున్నీసా (అదితిరావ్ హైదరీ)పై పడుతుంది. ఆమె కోరిన నిప్పుకోడిని బాహుమానంగా ఇచ్చి మనసు దోచుకుంటాడు. ఆమె తండ్రి అభీష్టంతో పెళ్లాడుతాడు. అయితే పెళ్లయిన తొలి రాత్రే భర్త మనసు మెహర్‌కు తెలిసి పోతుంది కానీ భర్త కాబట్టి ఏమీ చేయలేని స్థితి ఆమెది. జలాలుద్ధీన్ ఢిల్లీని ఆక్రమించుకుని ఢిల్లీసుల్తానుగా ప్రకటించుకుంటాడు. సింహాసనంపై కన్నేసిన అల్లావుద్ధీన్ మోసంతో జలాలుద్ధీన్‌ను చంపి ఢిల్లీకి చక్రవర్తిగా ప్రకటించుకుంటాడు. అదే సమయంలో మేవాడ్ రాజు రావల్ రతన్ సింగ్ (షాహిద్ కపూర్) అపురూపమైన ముత్యాల హారం కోసం సింహళ దేశం వెళతాడు. అక్కడ అపురూప సౌందర్యవతి సింహళ యువరాణి పద్మావతి (దీపికా పదుకునే)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె మనసు గెలుచుకుని పెళ్లి చేసుకుని మేవాడ్‌కు తీసుకొస్తాడు. మేవాడ్ రాజగురువు రాఘవ చింతనుడు రతన్‌సింగ్, పద్మావతిల ఏకాంత మందిరంలోకి దురుద్దేశంతో ప్రవేశించి పట్టుబడతాడు. రతన్ సింగ్ అతనికి దేశ బహిష్కరణ శిక్ష వేస్తాడు. కక్షతో రాఘవ చింతనుడు అల్లావుద్ధీన్ చెంత చేరి పద్మావతి అందం గురించి చెప్పి.. ఆమెను దక్కించుకోమని సలహా ఇస్తాడు. కామాంధుడైన అల్లావుద్ధీన్ మేవాడ్‌పై దండెత్తుతాడు. ఆత్మగౌరవానికి ప్రతీకలైన రాజపుత్రులు ఢిల్లీ సుల్తానుని ఎలా ఎదుర్కొన్నారు? అసలు ఖిల్జీ, పద్మావతిని దక్కించుకున్నాడా లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
- సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం
- నటీనటులు పెర్ఫామెన్స్
- నిర్మాణ విలువలు
- ఆర్ట్ వర్క్
- గ్రాండ్ విజువల్స్
- సంగీతం
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
- యుద్ధ సన్నివేశాలు భారీగా ఉంటాయనుకుంటే.. అలాంటి సన్నివేశాలు సినిమాలో లేవు
- సినిమాలో సన్నివేశాలు పాత్రల మధ్య ఎమోషన్స్ కనపడవు
- సన్నివేశాలు లోతు కనపడవు
- సన్నివేశాలు స్లో నెరేషన్‌లో సాగడం
విశ్లేషణ:
ఇందులో ముందుగా నటీనటుల ప్రతిభను పరిగణిస్తే ... మొదటిగా చెప్పుకోవాల్సింది రణవీర్ సింగ్ గురించి, అల్లావుద్ధీన్ ఖిల్జీ పాత్రలో తను ఒదిగిపోయాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తనదైన నటనతో క్యారెక్టర్ డల్ కాకుండా ముందుకు తీసుకెళ్లడంతో సఫలీకృతుడయ్యాడు రణవీర్. ఇక టైటిల్ పాత్రలో నటించి దీపికా ఎంతో తనదైన నటనతో పాత్రకు హుందాతనాన్ని తెచ్చిపెట్టింది. అప్పటి స్త్రీలు భర్తను ఎంత భక్తిగా చూసుకునేవారు. వారి వేషధారణ, హావభావాలన్నింటినీ దీపికా చక్కగా ప్రెజెంట్ చేసింది. ఇక రతన్ సింగ్ రావల్‌గా నటించిన సాహిద్ కపూర్ పాత్రలో ఒదిగిపోయి న్యాయం చేశాడు. అదితిరావు హైదరీ సహా మిగిలిన వారందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. హిస్టారికల్ సినిమా అంటే టెక్నిషియన్స్ సినిమానే అనే వాక్యానికి ఈ సినిమా న్యాయం చేసిందనే చెప్పాలి. దర్శకుడు సంజయ్ లీలాభన్సాలీ ఎవరినీ కించపరచకుండా కథను రాసుకున్నాడు. ఆధారాలు లేని ఓ కథను పుస్తకాలు ఆధారంగా తెరకెక్కించడం అంటే కత్తిమీద సామే అనాలి. సంజయ్ ఆ పనిని చక్కగా చేశాడు. పద్మావతి, అల్లావుద్ధీన్ ఖిల్జీ, మెహర్ ఉన్నీసా, రతన్ సింగ్ ప్రతి పాత్రను దర్శకుడు చక్కగా డిజైన్ చేసుకున్నాడు. ప్రతి సీన్‌ను లార్జర్ దేన్ లైఫ్‌గా తెరకెక్కించడం తనకే సాధ్యం అనేలా తెరకెక్కించాడు. రాజ భవనాలు, వారి అభరణాలు, వేషధారణ అన్నింటినీ చక్కగా చూపించాడు. చివరల్లో ఆత్మాహుతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సంజయ్ లీలా భన్సాలీ సంగీతం, సంచిత్ బల్హారా నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా గూమర్హా సాంగ్ సింప్లీ సూపర్బ్. సుదీప్ చటర్జీ ప్రతి సన్నివేశాన్ని తెరపై చూపించిన తీరు అద్వితీయం. మాక్సిమా బసు కాస్ట్యూమ్స్ వర్క్ ఎక్సలెంట్ ఇలా ప్రతి ఒక సాంకేతిక నిపుణుడు సినిమాను ఓ కావ్యంలా వచ్చేలా తోడ్పడ్డారు. అయితే సినిమా స్లో నెరేషన్లో ఉండటం.., యుద్ధ సన్నివేశాలు ఉండాల్సిన సినిమాలో అవేవీ లేకపోవడం.. పాత్రలు, సన్నివేశాలు మధ్య బలమైన ఎమోషన్స్ లేకపోవడం వంటి కారణాలతో సినిమా బలహీనంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా చాలా బావున్నాయి. అయితే ఇందులో దర్శకుడు ఎవరినీ కించపరచలేదు. కాల గర్భంలో కలిసిపోయిన ఓ మహారాణి త్యాగాన్ని వెలుగులోకి తెచ్చాడు. మరి దీనిపై వివాదాలెందుకనో అర్థం కాలేదు.
బాటమ్ లైన్: పద్మావత్... ఆత్మ త్యాగానికి ప్రతీక
Padmavat Movie Review in English
- Read in English