పద్మశ్రీ వనజీవి రామయ్యకు యాక్సిడెంట్ .... ఐసీయూలో ట్రీట్‌మెంట్, ఆందోళనలో అభిమానులు
- IndiaGlitz, [Wednesday,May 18 2022]
మొక్కలు పెంపకం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి, పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం ఉదయం ఖమ్మం జిల్లా పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రామయ్య తన వాహనంపై వెళ్తున్నారు. ఈ సమయంలోనే రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మరో బైక్ రామయ్యను ఢీకొట్టింది. దీంతో ఆయన కిందపడి తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వనజీవి రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాలికి గాయమవ్వడంతో సర్జరీ చేయాలని కొద్దిరోజుల క్రితం వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఇవాళ రోడ్డు ప్రమాదంలో రామయ్య తలకు గాయమైంది. ఆయన ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
కాగా, 2019 మార్చిలో కూడా ఇలాగే రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ ఏడాది మార్చి 30న తన మనమరాలిని చూసి తన వాహనంపై వెళ్తున్న రామయ్యను స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయనను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఆయన త్వరగానే కోలుకున్నారు.
ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన శ్రమిస్తున్నారు. తన ప్రయత్నంలో భాగంగానే ..ప్రతి చోట విత్తనాలు నాటుతూ, ప్రజలకు మొక్కలు పెంచడం వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ వస్తున్నారు. అంతరించిపోతున్న వృక్ష సంపదను పెంచడానికి రామయ్య చేస్తున్న కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.