ఆక్సిజన్‌ను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు
- IndiaGlitz, [Saturday,May 29 2021]
ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ అవసరం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆక్సిజన్ కొరత కారణంగా రోజుకు ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ను తరలిస్తున్న గూడ్స్ రైలు అగ్నిప్రమాదానికి గురవడం తీవ్ర కలకలం రేపింది. ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగడంతో పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి ఆరు ఆక్సిజన్ ట్యాంకర్లతో ఓ రైలు రాయ్‌పూర్‌కు బయలు దేరింది.
అయితే రైలు పెద్దపల్లి జిల్లా కూనారం-చీకురాయి మధ్యకు రాగానే ఒక ట్యాంకర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన ప్రమాదం జరిగిన బోగిని ఇతర బోగీల నుంచి విడగొట్టి దూరంగా తరలించారు. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.