హీరో నుండి విలన్‌గా..అటు నుండి మళ్లీ హీరోగా రూటు మార్చి యాక్షన్ హీరో ఇమేజ్ దక్కించుకున్న గోపీచంద్‌కు `లౌక్యం` తర్వాత ఆ మంచి సక్సెస్ దక్కలేదు. సక్సెస్ కోసం గోపీచంద్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రయత్నంలో తన తండ్రి టి.కృష్ణకు సన్నిహితుడు, పెద్ద నిర్మాత అయిన ఎ.ఎం.రత్నంతో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు గోపీచంద్. ఈ సినిమాకు రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకుడు కావడం వివేషం. ఇక్కడ విశేషం అని ఎందుకు ప్రస్తావించామంటే..సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం `నీ మనసు నాకు తెలుసు` అనే ప్లాప్ సినిమాను తెరకెక్కించిన జోతికృష్ణ..ఇప్పుడు ఇంత కాలానికి తెలుగులో సినిమా చేయడం కాస్త క్యూరియాసిటీని పెంచే అంశమే. మరి ఇంత గ్యాప్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన జోతికృష్ణ, హిట్ కోసం వెయిట్ చేస్తోన్న గోపీచంద్‌కు హిట్ ఇచ్చాడా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా సమీక్షలోకి వెళదాం..
కథ:
పత్తి అండ్ కో ఓనర్ శ్రీపతి (నాగినీడు)ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారు. అంతకు ముందే ఆ కుటుంబానికి చెందిన కుమారుడిని, అల్లుడిని కూడా కొందరు చంపేసి ఉంటారు. దాంతో రఘుపతి (జగపతిబాబు) తన కుటుంబ సభ్యులను ఊరి నుంచి బయటకు పంపకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె శ్రుతి (రాఖీఖన్నా)కు కూడా అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ ప్రకారం అమెరికా నుంచి పెళ్లి చూపుల కోసం మైక్రోసాఫ్ట్ ఉద్యోగి కృష్ణ ప్రసాద్ (గోపీచంద్)ని పిలిపిస్తారు. పెళ్లి చూపులకు వచ్చిన కృష్ణ ప్రసాద్ వారి కుటుంబంలో ఒకరిగా కలిసిపోతాడు. వారికి ఆపద వచ్చినప్పుడు అండగా నిలుస్తాడు. కానీ ఒకానొక సందర్భంలో అతను ప్రసాద్ కాదనీ మిలిటరీ ఆఫీసర్ సంజు అని తెలిసిపోతుంది. ఇంతకీ ఎవరీ సంజీవ్? అతని తమ్ముడి చావుకి పతి బ్రద్స్ కీ సంబంధం ఏంటి? ఇంతకీ అతను శ్రుతిని చేసుకున్నాడా? లేదా? రఘుపతికి లోకల్‌లో ఉన్న శత్రువు ఎవరు? వంటివన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్లు:
జగపతిబాబు నటన సినిమాకు హైలైట్. పల్లెటూరి వ్యక్తిగా, ఓ పెద్ద వ్యాపారవేత్తగా చాలా బాగా నటించారు. కీలక సన్నివేశాల్లో అను ఇమ్మాన్యుయేల్ నటన, పాటలో ఆమె గ్లామర్, రాశీఖన్నా చేసే అల్లరి సినిమాలో బావుంటాయి. `మీరు పొగ తాగితే మీ చుట్టు పక్కల వాళ్లు కూడా పొగ తాగినట్టే` అని ప్రకటనల్లో వినే మాటలను తెరమీద చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. వ్యక్తిలో పరివర్తన సొంతంగా రావాలే తప్ప, ఎవరో బలవంతం చేస్తే రాదనే సంగతి దర్శకుడు సున్నితంగా చూపించాలనుకున్నాడు. యువతను దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమా ఇది. పాటలు కూడా అక్కడక్కడా బావున్నాయి. సినిమాటోగ్రపీ లావిష్‌గా ఉంది.
మైనస్ పాయింట్లు:
సినిమా ప్రారంభ సన్నివేశాలు అత్యంత సాధారణంగా ఉంటాయి. ఎవరి పాత్రా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. రీరికార్డింగ్ కూడా సో సోగానే అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బావుండేది. తొలి సగంలో రఘుపతి ఇంట్లో కృష్ణ ప్రసాద్ పాత్ర చేసే ఓవర్ యాక్షన్ చూసి ప్రేక్షకుడికి అతనే విలన్ అనే డౌట్ తప్పకుండా వచ్చి తీరుతుంది. కొన్ని సన్నివేశాలు అతికించినట్టు ఉన్నాయేగానీ, ఫ్లో లో కనిపించవు. పాటలు మళ్లీ మళ్లీ పాడుకునేలా లేవు. ఒకటీ, అరా తప్ప డైలాగులు కూడా ఇంట్రస్టింగ్‌లా లేవు.
విశ్లేషణ:
ఉద్దేశం మంచిదే అయి ఉండవచ్చు కానీ దాని నిర్వహణ కూడా ఆసక్తికరంగా ఉండాలి. ఈ సినిమా విషయంలో జరిగింది అదే. పొగ తాగకూడదు అనే పాయింట్ మంచిదే.. ధూమపానానికి బానిసైన యువత చెడిపోతుందనే విషయాన్ని సూటిగా చెప్పాలనుకున్నారు కానీ, దాన్ని అందంగా చెప్పలేకపోయారు. పాత వైన్ అయినా కొత్త సీసాలో పోస్తేనే ఆకట్టుకుంటుంది. కానీ కొత్త వైన్‌ని కూడా పాత సీసాలో పోశారేమోననిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఎక్కడా మెప్పించదు. ఒక్క ఇంటర్వెల్ సన్నివేశాన్ని మినహాయిస్తే సినిమా ఎక్కడా కూడా ఆసక్తికరంగా ఉండదు. రొటీన్ కమర్షియల్ చిత్రంగానే ఉంటుంది. అప్పటిదాకా తన కుటుంబం గురించి ఆలోచించిన హీరోయిన్ ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తోనే మారిపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
బాటమ్ లైన్: కమర్షియల్ 'ఆక్సిజన్'
Oxygen Movie Review in English
Comments