చంద్రబాబు షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!
- IndiaGlitz, [Friday,May 10 2019]
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సీజన్ మొదలుకుని నేటి వరకూ టీడీపీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వరుసగా చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. ఎన్నికలకు ముందు బాబు ధర్నా, ఈసీ తీరు సరిగ్గా లేదని ధర్నా, ఆ తర్వాత సమీక్షలకు ఈసీ రెడ్ సిగ్నల్, సీఎస్ సరిగ్గా సహకరించకపోవడం, సీఎం వర్సెస్ సీఎస్‌గా పరిస్థితులు మారడం, పోలవరం సందర్శనకు అధికారులు, కార్యదర్శకులు, కలెక్టర్లు హాజరుకాకపోవడం, వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కట్టాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. సుప్రీంలో ఎదురుదెబ్బ తగలడం ఇలా వరుస ఘటనలతో చంద్రబాబుకు ఏం చేయాలో దిక్కుతోచట్లేదు.
టీడీపీలో అసలేం జరుగుతోంది..?
ఇవన్నీ ఒక ఎత్తయితే సమీక్షలకు సొంత పార్టీ నేతలే రాకపోవడం మరో ఎత్తు. సొంత పార్టీ నేతలు ఎందుకు హాజరు కావట్లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సాధారణంగా పార్టీ అధినేత సమావేశం పెట్టినా.. ఆయా జిల్లాల నేతలు హాజరుకావడం, ఇక నేతలందరూ రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తే తప్పక హాజరుకావాల్సిందే కానీ.. ఈ రెండింటికి ప్రస్తుతం వ్యతిరేకంగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. పార్టీ అధినేత మాటలను అస్సలు లెక్కచేయట్లేదు. సీఎం సమావేశానికి వెళ్లేది లేదు.. అయితే ఏంటి..? అన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీలో అసలేం జరుగుతోంది..? నేతలు ఎందుకిలా వ్యవహరిస్తున్నారు..? అని చంద్రబాబు ఆలోచనలో పడ్డారట.
కీలక నేతలు డుమ్మా.. చంద్రగ్రహం?
ఇక అసలు విషయానికొస్తే.. శుక్రవారం శ్రీకాకుళం టీడీపీ లోక్ సభ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు జిల్లా మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ వేదికైంది. అయితే ఈ సమావేశానికి జిల్లాకు చెందిన కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాకపోవడం గమనార్హం. దీంతో చంద్రబాబు ఒకింత షాకయ్యారు. కాగా.. శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి కుటుంబసభ్యుడొకరు మృతి చెందగా.. ఆమె హాజరు కాలేకపోయారు. ఆమె సంగతి అటుంచితే మిగిలిన నేతలు కూడా ఏదో వంక పెట్టి రాలేకపోయామని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఆగ్రహానికి లోనయ్యారు. సమీక్ష అని తెలిసి కూడా ఎందుకు రాలేదు..? ముందుగా సమాచారం ఇచ్చినా ఎందుకు హాజరుకావట్లేదు..? అసలేం జరుగుతోంది పార్టీలో..? అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండిపడ్డట్లు సమాచారం. కాగా ఈ సమీక్షకు పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, ఆముదాలవలస, నరసన్నపేటకు మాత్రమే హాజరయ్యారు.
ముందే తెలిసిపోయిందా..?
చంద్రబాబు చేస్తున్న పనులతో తెలుగు తమ్ముళ్లు విసిగివేసారిపోయారట. అందుకే చంద్రబాబుకు వ్యతిరేకంగా కొందరు గ్రూపు కట్టాలనే యోచనలో ఉన్నారట. మరీ ముఖ్యంగా ఫలితాలు మనకు అనుకూలంగా ఉండవని.. తెలుగుదేశం గెలిచే పరిస్థితులు లేవని ముందుగానే గ్రహించిన తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు ఇలా వరుస షాక్‌లు ఇస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. సో.. మే-23న ఫలితాలు వెలువడ్డాక పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.